
జైపూర్: కరోనా విలయంలో ఎన్నో ఘోరాలు.. మరెన్నో దారుణాలు.. చోటు చేసుకుంటున్నాయి. పేగుబంధం కోసం మోయలేని కష్టాన్ని పంటి బిగివున భరిస్తున్నారు కుటుంబ సభ్యులు. అలాంటి సందర్భమే ఎదురైంది రాజస్థాన్‌లో ఓ తండ్రికి.
అడినంత ఇచ్చుకోలేక
రాజస్థాన్‌లో జల్వార్ గ్రామానికి చెందిన సీమకు కరోనా సోకింది. ఆ గ్రామానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటాలో ఓ ఆస్పత్రిలో ఆమెను చేర్చారు. దాదాపు నెలరోజుల పాటు కరోనాతో పోరాడిన ఆ యువతి చివరకు కన్నుమూసింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆమె తండ్రి అంబులెన్స్ డ్రైవర్లను సంప్రదిస్తే రూ. 35,000 ఇస్తే తప్ప రామన్నారు.
పాడేగా మారిన పక్క సీటు
అంబులెన్సు డ్రైవర్లు అడిగినంత డబ్బు ఇచ్చుకోలేని ఆ తండ్రి, తన కారులోనే కూతురి మృతదేహాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించాడు. డ్రైవర్‌సీటు పక్క సీటునే పాడేగా మార్చాడు. కూతురు శవాన్ని ఆ సీట్లో కూర్చోబెట్టి, సీట్‌బెల్టుతో మృతదేహన్ని కదలకుండా గట్టిగా కట్టాడు. ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఒక్కడే ఈ పనంతా చేశాడు. ఆ తర్వాత 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లాడు.
విచారణకు ఆదేశం
ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో జిల్లా కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన రేటు కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఒక్క రాజస్థాన్‌లోనే కాదు చాలా చోట్ల ప్రభుత్వ నిబంధనలు అమలు కాకపోవడంతో కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment