భార్య సమ్మతి లేకుంటే.. బలాత్కారమే! | Marriage not license to unleash brutal beast on wife | Sakshi
Sakshi News home page

భార్య సమ్మతి లేకుంటే.. బలాత్కారమే!

Published Thu, Mar 24 2022 4:34 AM | Last Updated on Thu, Mar 24 2022 9:33 AM

Marriage not license to unleash brutal beast on wife - Sakshi

బెంగళూరు: తాళి కట్టినంత మాత్రాన, అర్ధాంగిగా స్వీకరించినంత మాత్రాన అమ్మాయిపై సర్వహక్కులు తమవేననే భావన భారత పితృస్వామ్య వ్యవస్థలో బలంగా వేళ్లూనుకుపోయింది. ఇది సరికాదని, స్త్రీ సమ్మతి లేకుండా భర్త బలవంతంగా కోరిక తీర్చుకుంటే.. దాన్ని మానభంగంగానే పరిగణించాలని కర్ణాటక హైకోర్టు బుధవారం విస్పష్టంగా పేర్కొంది. మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణించాల్సిన సమయం వచ్చిందంటూ పరోక్షంగా దేశంలో అత్యంత ముఖ్యమైన, కీలకమైన చర్చకు తెరతీసింది.

ఇష్టం లేకున్నా కోరిక తీర్చుకున్నాడని ఓ మహిళ పెట్టిన కేసును కొట్టివేయాలని ఆమె భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్‌ ఎం.నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం అందుకు తిరస్కరించింది. వైవాహిక బంధం భర్తకు ప్రత్యేక అధికారాలు, పెత్తనం ఏమీ కట్టబెట్టదని.. స్ట్రీకి ఇష్టం లేని సంభోగం కచ్చితంగా రేప్‌ కిందకే వస్తుందని, భర్త అయినంత మాత్రాన దీనికేమీ మినహాయింపు ఉండదని అభిప్రాయపడింది. చారిత్రక చర్చకు తెరలేపింది. కూతురిని కూడా భర్త లైంగికంగా వేధించాడని సదరు మహిళ ఫిర్యాదు చేయడంతో.. అతనిపై బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) కింద కూడా కేసు నమోదు చేసి విచారించాల్సిందిగా అదేశించింది.  

లైంగిక వాంఛలకు పెళ్లి లైసెన్స్‌ కాదు!
సతీమణి ఇష్టానిష్టాలకు విలువనివ్వకుండా... ఎప్పుడు పడితే అప్పుడు వాంఛలు తీర్చుకోవడానికి పెళ్లి అనేది ఒక లైసెన్స్‌ కాదని జస్టిస్‌ నాగప్రసన్న పేర్కొన్నారు. పాశ్చాత్యదేశాల్లో మహిళ సమ్మతి లేకుండా సంభోగానికి పాల్పడితే దాన్ని చట్టపరంగా నేరంగానే పరిగణిస్తున్నారు. అయితే భారత్‌లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం, పితృస్వామ్య వ్యవస్థ భావనలు బలంగా వేళ్లూనుకొని ఉండటం, సామాజిక కట్టుబాట్లు, ఆచారవ్యవహారాల పేరిట.. కేంద్ర ప్రభుత్వాలు చాన్నాళ్లుగా ఈ అంశం జోలికి (మారిటల్‌ రేప్‌ను నేరంగా మార్చే చట్ట సవరణకు) పోవడం లేదు.

భార్యాభర్తలు అనే దానితో సంబంధం లేకుండా.. అమ్మాయి సమ్మతి లేకుండా లైంగిక దాడికి పాల్పడితే అది కచ్చితంగా నేరమే అవుతుందని జస్టిస్‌ నాగప్రసన్న బుధవారం అభిప్రాయపడ్డారు. బలత్కారమనేది స్త్రీల మానసిక స్థితిపైన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, వారికి భయకంపితులను చేస్తుందని పేర్కొన్నారు. అమ్మాయిని బలవంతంగా అనుభవించడం నేరమైనపుడు అది జీవిత భాగస్వామి అయినా సరే నేరంగానే చూడాలన్నారు.

‘తరతరాలుగా పురుషుడు భర్త అనే ముసుగులో.. మహిళలను తన సొంత ఆస్తిగా చూస్తున్నాడు. భార్యలు తమ చెప్పుచేతల్లో ఉండాలనుకునే బూజుపట్టిన ఆలోచనలు, సంప్రదాయాలను సమూలంగా తుడిచిపెట్టాల్సిందే. భర్తకు రేప్‌ నుంచి మినహాయింపునిస్తున్న భారత నేర స్మృతిలోని (ఐపీసీ) 375 సెక్షన్‌ ఏమాత్రం ప్రగతిశీల ఆలోచన కాదు. నా దృష్టిలో అది తిరోగమన భావన. అర్ధాంగిగా స్వీకరించిన మహిళ శరీరం, ఆలోచనలపై తమకు సంపూర్ణ హక్కులు దఖలు పడ్డాయనే భావన.. కచ్చితంగా తిరోగమన ఆలోచనే.

స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమనే భావనకు ఇది తూట్లు పొడుస్తుంది. అందువల్లే చాలాదేశాలు మారిటల్‌ రేప్‌ను నేరంగా చేశాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్, అమెరికాలోని 50 రాష్ట్రాలు, ఆస్ట్రేలియాలోని మూడు ఫ్రావిన్సులు, న్యూజిలాండ్, కెనడా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్‌... తదితర దేశాలు మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నాయని జస్టిస్‌ నాగప్రసన్న ఎత్తిచూపారు. భారత్‌లోనూ అసంఖ్యాక స్త్రీల మౌనరోదనను గుర్తించి చట్టసభల సభ్యులు ఈ మేరకు మారిటల్‌ రేప్‌ చట్టంలో మార్పులు తేవాలని అభిప్రాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement