
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు విమాన ప్రయాణీకులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను నిర్దేశించింది. మాస్కు ధరిస్తేనే విమాన ప్రయాణానికి అనుమతి ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తేల్చి చెప్పింది. అంతేకాదు విమానంలో ఫేస్ మాస్క్ ధరించడానికి నిరాకరించిన ఏ ప్రయాణీకుడినైనా విమానయాన సంస్థ నో-ఫ్లై జాబితాలో ఉంచవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ప్రస్తుత డీజీసీఏ నిబంధనల ప్రకారం విరుద్ధంగా ప్రవర్తించే ప్రయాణీకులపై చర్యలకు ఎయిర్‌లైన్స్, క్యాబిన్ సబ్బందికి అధికారం ఉందని వెల్లడించారు.
గురువారం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, దేశీయ విమానాలలో ముందుగా ప్యాక్ చేసిన స్నాక్స్, భోజనం, ఇతర పానీయాలకు అనుమతి ఉంటుంది. విమానయాన వ్యవధిని బట్టి దేశీయ విమానాలలో ప్రీ-ప్యాక్డ్ భోజనం, పానీయలను అందించవచ్చు. అలాగే అంతర్జాతీయ విమానాలు, చార్టర్ ఫ్లైట్ ఆపరేటర్లు కూడా తమ ప్రయాణీకులకు ప్రామాణిక పద్ధతుల ప్రకారం వేడి భోజనం, ఇతర పానీయాలను అందించేందుకు అనుమతించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలలో ఆహారం లేదా పానీయాలను అందిస్తున్నప్పుడు సింగిల్ యూజ్ డిస్పోజబుల్ ట్రేలు, ప్లేట్లు మాత్రమే వాడాలని తెలిపింది. అలాగే ప్రతీసారి సిబ్బంది హ్యాండ్ గ్లౌజులు ధరించాలని పేర్కొంది. ప్రయాణ ప్రారంభంలో ప్రయాణీకులకు డిస్పోజబుల్ ఇయర్ ఫోన్లు లేదా శుభ్రపరిచిన , శానిటైజ్ చేసిన హెడ్ ఫోన్లు అందిస్తారని తెలిపింది.
కాగా కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా మార్చి 23 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయాయి. దాదాపు మూడు నెలల తరువాత మే 25న దేశీయ విమానాలు పాక్షికంగా తిరిగి ప్రారంభమైనా, భోజనం సరఫరాకు అనుమతి లేదు.
Comments
Please login to add a commentAdd a comment