రౌర్కెలా స్టేడియంను సందర్శిస్తున్న క్రీడాశాఖ మంత్రి తుషార్‌కాంతి
భువనేశ్వర్: హాకీ కప్ ప్రపంచ టోర్నమెంట్‌కు రాష్ట్రం మరోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహనకు రాష్ట్ర క్రీడాభిమానుల వర్గం ఉవ్విళ్లూరుతోంది. 2023లో రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో హాకీ ప్రపంచ కప్–2023 నిర్వహించేందుకు ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభించింది. రాష్ట్రంలో తొలిసారిగా 2018లో పురుష హాకీ ప్రపంచకప్ టోర్నమెంట్‌కు వెదికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చేసిన ఏర్పాట్లు, నిర్వహణ కార్యకలాపాల పట్ల అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్‌ఐహెచ్) అత్యంత సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వరుసగా మరోసారి ప్రపంచ హాకీ కప్ నిర్వహించాలనే ఒడిశా అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించింది. భువనేశ్వర్, రౌర్కెలా ప్రాంతాల్లో ఈ టోర్నీ నిర్వహణకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య అనుమతించింది.
హాకీ ప్రపంచ కప్–2018తో సీఎం నవీన్ పట్నాయక్ (ఫైల్)
హాకీ ప్రపంచ కప్–2023 నిర్వహణ ఏర్పాట్లు పట్ల ఉక్కునగరం రౌర్కెలా ఉత్సాహంతో ఉరకలేస్తుంది. 2018లో రాష్ట్ర రాజధాని నగరంలో జరిగిన దానికంటె ఘనంగా రౌర్కెలాలో 2023 ప్రపంచ కప్ నిర్వహించాలని ఇక్కడి క్రీడాభిమానులు కృషి చేస్తున్నారు. టోర్నమెంట్ కార్యకలాపాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులను ఉన్నత స్థాయి అధికార బృందం శుక్రవారం ప్రత్యక్షంగా సమీక్షించింది. రాష్ట్ర క్రీడలు–యువజన వ్యవహారాల విభాగం మంత్రి తుషార్‌కాంతి బెహరా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసిత్‌కుమార్ త్రిపాఠి, అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు నరేంద్ర ధృవ్‌బత్ర, క్రీడలు–యువజన వ్యవహారాల విభాగం ఉన్నతాధికారులు, ఒడిశా పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్(ఇడ్కో), హాకీ ఇండియా, సుందరగడ్, రౌర్కెలా స్థానిక అధికారులు ప్రపంచ హాకీ కప్–2023 ఏర్పాట్లు సమీక్షించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు..
హాకీ ప్రపంచ కప్–2023 టోర్నమెంట్ రాష్ట్రంలో రెండు వేర్వేరు వేదికల్లో నిర్వహించే అవకాశం లభించడం అపురూపం. ఈ సదవకాశం సవాలుగా తీసుకుని గతం కంటే ఘనంగా నిర్వహించేందుకు విభాగం అహర్నిశలు కృషి చేస్తోందని రాష్ట్ర క్రీడలు–యువజన వ్యవహారాల విభాగం మంత్రి తుషార్‌కాంతి వెల్లడించారు. రాజధాని నగరంలో ఇటీవల పోటీలు నిర్వహించడంతో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
రౌర్కెలాలో తొలిసారి జరుగుతున్న ఈ పోటీల పట్ల స్థానిక పాలన, అధికార యంత్రాంగాలతో క్రీడాకారులు, క్రీడాభిమానులు ఉత్సాహంతో ఏర్పాట్లలో స్వచ్ఛందంగా పాలుపంచుకోవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ కప్ విజయవంతంగా నిర్వహించేందుకు రెండు వేదికల్లో ప్రపంచ శ్రేణి సదుపాయాలు కల్పిస్తున్నారు. క్రీడాకారులకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోయే రీతిలో ఏర్పాట్లు చేయనున్నట్లు బెహరా ప్రకటించారు. క్రీడాకారులు, క్రీడాధికారులు, ప్రపంచ వ్యాప్తం క్రీడాస్ఫూర్తిదాతలు ఇతరేతర అనుబంధ వర్గాలకు ఈ టోర్నమెంట్ మధురానుభూతిగా నిలిచి పోతుందని వివరించారు. 2022 మధ్య భాగంలో టోర్నమెంట్ ఏర్పాట్లు పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment