చంఢీగర్: హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది. ఆందోళనలు ప్రారంభమై 18 గంటలు గుడుస్తున్నా ఏమాత్రం చల్లారడం లేదు. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లా నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాద్‌షాపూర్ ప్రాంతంలో తాజాగా నిరసనకారులు రెచ్చిపోయారు. దుకాణాలను ఆందోళనకారులు కూల్చేస్తున్నారు. ఓ రెస్టారెంట్‌కు నిప్పంటించారు.
మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో దాదాపు 200 మంది ఆందోళనకారులు ఆ ప్రాంతానికి వచ్చినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. షాపులను, మాంసం దుకాణాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ అల్లర్లలో దాదాపు నలుగురు మృతి చెందారు. దాదాపు 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో ఇప్పటికే 44 కేసులు నమోదు కాగా.. 70 మందిని అరెస్టు చేశారు.
హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లాతో సహా పక్కనే ఉన్న ప్రాంతాలకు కూడా వ్యాపించింది. నుహ్ జిల్లాకు పక్కనే ఉన్న గురగ్రామ్‌కు కూడా ఈ అల్లర్లు వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు హోం గార్డులు మరణించగా.. నిన్న రాత్రి జరిగిన అల్లర్లలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటివరకు 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
సోమవారం విశ్వ హిందూ పరిషత్ నిర్వహించే శోభాయాత్రపై ఓ వర్గం ప్రజలు రాళ్లదాడి జరిపారు. అక్కడి నుంచి ప్రారంభమైన అల్లర్లు నుహ్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. అల్లరిమూకలు ఇప్పటికే వందల వాహనాలకు నిప్పంటించారు. ఘర్షణలను అదుపు చేయడానకిి కర్ఫ్యూ కూడా విధించింది ప్రభుత్వం. ఇంటర్‌నెట్‌ని కూడా నిలిపివేసింది. సంయమనం పాటించాలని ప్రజలను సీఎం కోరారు.
ఇదీ చదవండి: Haryana Nuh Violence: హర్యానాలో హై అలర్ట్.. కర్ఫ్యూ విధింపు..
Comments
Please login to add a commentAdd a comment