
నైరుతి రుతుపవనాలు వేగంగా వచ్చేస్తున్నాయి. జూన్ 3న కేరళ తీరాన్ని తాకనున్నట్టు వాతావారణ శాఖ తెలిపింది.
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు వేగంగా వచ్చేస్తున్నాయి. జూన్ 3న కేరళ తీరాన్ని తాకనున్నట్టు వాతావారణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ మొదటి వారంలో నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని చేరుకుంటాయి. అయితే ఈసారి మే 31న కేరళకు రుతుపవనాలు వస్తాయని వాతవరణ శాఖ మొదట అంచనా వేసింది. ప్రస్తుతం జూన్ 3న కేరళను తాకుతాయని చెబుతోంది.
తొలకరి చినుకులు
జూన్ మొదటి వారానికి కర్నాటక, గోవా తీరాలకు నైరుతి రుతు పవనాలు చేరుకుంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. రుతు పవనాల ఆగమనంతో కేరళ, మహే, కర్నాటకలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ.
మండుతున్న ఎండలు
గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు భగ్గుమంటున్నాడు. మరో వారం పది రోజుల్లో రుతు పవనాలు తెలుగు రాష్ట్రాలకు చేరుకోనున్నాయి. దీంతో ఎండల తీవ్రత తగ్గనుంది. ఇటీవల వచ్చిన టౌటే, యాస్ తుపానుల కారణంగా రుతుపవనాల రాకలో ఏదైనా జాప్యం జరుగుతుందేమమో అనే ఆందోళన రైతుల్లో నెలకొని ఉండేది. కానీ రుతుపవనాలు సకాలంలో వస్తున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు.