
నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళలోకి ప్రవేశించాయి.
తిరువనంతరం : మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లని కబురు అందింది. కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలోని 9 జిల్లాలకు ఐఎండీ యల్లో అలర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లాం, పతనంథిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురం, కన్నూర్ జిల్లాలను అప్రమత్తం చేసింది. మత్స్యకారులు చేపలవేటకు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు పేర్కొన్నారు.
కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో లక్షదీప్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.