New Coronavirus Strain In India | 20 Passengers From UK Tests Covid Positive - Sakshi
Sakshi News home page

కరోనా–2 కలకలం

Published Wed, Dec 23 2020 4:37 AM | Last Updated on Wed, Dec 23 2020 12:05 PM

More Tests For New Coronavirus Symptoms - Sakshi

న్యూఢిల్లీ/ముంబై: బ్రిటన్‌లో తాజాగా గుర్తించిన కొత్త రకం కరోనా వైరస్‌ భారత్‌లో కూడా అడుగుపెట్టిందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. లండన్‌ నుంచి భారత్‌ లోని వివిధ రాష్ట్రాలకు వచ్చిన విమాన ప్రయాణికులకు నిర్వహించిన పరీక్షల్లో 20 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే, వారిలో కొత్తగా గుర్తించిన వైరస్‌ స్ట్రెయిన్‌ ఉన్నదీ, లేనిదీ ప్రత్యేకంగా పరీక్షించి, నిర్ధారించాల్సి ఉంది. బ్రిటన్‌ నుంచి సోమవారం రాత్రి ఢిల్లీకి వచ్చినవారిలో ఆరుగురికి, ఆదివారం రాత్రి కోల్‌కతాకు వచ్చినవారిలో ఇద్దరికి, మంగళవారం అహ్మదాబాద్‌ వచ్చినవారిలో నలుగురికి, పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు సోమవారం వచ్చినవారిలో విమాన సిబ్బందిలోని ఒకరు సహా ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

వీరంతా లండన్‌ నుంచి ఎయిర్‌ ఇండియా విమానాల్లో నేరుగా ఆయా నగరాల విమానాశ్రయాలకు వచ్చారు. ఈ 20 మందిని ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లోనే ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. బ్రిటన్‌ నుంచి భారత్‌ వచ్చిన విమాన ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎయిర్‌ ఇండియా విమానంలో లండన్‌ నుంచి ఢిల్లీకి సోమవారం రాత్రి వచ్చిన వారిలో ఐదుగురికి కరోనా సోకినట్లు తేలిందని ఒక అధికారి తెలిపారు. ఢిల్లీ నుంచి కనెక్టింగ్‌ ఫ్లైట్‌లో చెన్నై వెళ్లిన మరో వ్యక్తికి కూడా కోవిడ్‌ –19 పాజిటివ్‌గా నిర్ధారించారు. లండన్‌ నుంచి ఢిల్లీకి మంగళవారం ఉదయం వచ్చిన విమాన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో ఆ దేశం నుంచి విమానాల రాకపోకలపై భారత్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే.   
ఫ్రాన్స్‌ సరిహద్దులను మూసివేయడంతో బ్రిటన్‌లోని మన్‌స్టన్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో నిలిచిన లారీలు, భారీ రవాణా వాహనాలు 

ముంబైకి 590 మంది
బ్రిటన్‌ నుంచి మంగళవారం మూడు విమానాల్లో సుమారు 590 మంది ప్రయాణికులు ముంబై వచ్చారు. అయితే, ఈ ప్రయాణికుల్లో కరోనా లక్షణాలున్న వారెవరూ లేరని ఒక అధికారి తెలిపారు. ఆ 590 మందిలో ముంబైకి చెందినవారు 187 మంది, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల వారు 167 మంది, ఇతర రాష్ట్రాలకు చెందినవారు 236 మంది ఉన్నారన్నారు. మహారాష్ట్ర వారిని క్వారంటైన్‌కు, ఇతర రాష్ట్రాల వారిని వారివారి రాష్ట్రాలకు పంపించామన్నారు. గత రెండు వారాల్లో బ్రిటన్‌ నుంచి కర్ణాటకకు సుమారు 500 మంది వచ్చారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌ తెలిపారు. బ్రిటన్‌ నుంచి సోమవారం కోల్‌కతా వచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలిందని పశ్నిమబెంగాల్‌  అధికారులు వెల్లడించారు.

లండన్‌ నుంచి 222 మంది ప్రయాణికులతో ఒక విమానం ఆదివారం రాత్రి కోల్‌కతా వచ్చిందని తెలిపారు. వారిలో గత మూడు రోజుల్లో కోవిడ్‌ పరీక్ష చేయించుకున్నట్లుగా నిర్ధారించే రిపోర్ట్స్‌ 25 మంది వద్ద లేవన్నారు. వారిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించామని, ఆ 25 మందిలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలిందని వివరించారు. యూకే నుంచి పంజాబ్‌లోని అమృతసర్‌కు 250 మంది ప్రయాణికులు, 22 మంది సిబ్బందితో సోమవారం అర్ధరాత్రి వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానంలోని ప్రయాణికుల్లో ఏడుగురికి, సిబ్బందిలో ఒకరికి కరోనా సోకిందని రాష్ట్ర అధికారులు తెలిపారు. లండన్‌ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు మంగళవారం వచ్చిన విమాన ప్రయాణీకుల్లో నలుగురికి కరోనా సోకినట్లు గుజరాత్‌ అధికారులు మంగళవారం తెలిపారు. 

6 నెలల తర్వాత తగ్గిన కొత్త కేసులు
దేశంలో కోవిడ్‌ మహమ్మారి ప్రబలిన 6 నెలల తర్వాత మొట్ట మొదటిసారిగా కొత్త కేసులు 20 వేల దిగువన నమోదయ్యాయి. అదేవిధంగా, యాక్టివ్‌ కేసులు 3 లక్షల లోపునకు పడిపోయాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్క రోజులో కొత్తగా 19,556 కోవిడ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు 1,00,75,116కు చేరుకున్నట్లు వివరించింది. 24 గంటల్లో మరో 301 మంది కోవిడ్‌ బాధితులు మరణించడంతో మృతుల సంఖ్య 1,46,111కు చేరిందని తెలిపింది. కోవిడ్‌ బారిన పడి ఇప్పటి వరకు 96,36,487 మంది కోలుకోవడంతో రికవరీ రేటు 95.65%గా, మరణాల రేటు 1.45%గా ఉంది. దేశంలో కరోనా యాక్టివ్‌ కేసులు 2,92,518 కాగా మొత్తం కేసుల్లో ఇది 2.90% అని కేంద్రం వెల్లడించింది. జూలై 12న 2.92 లక్షలుగా నమోదైన అనంతరం మంగళవారం తిరిగి యాక్టివ్‌ కేసులు 2.92 లక్షలకు చేరాయని  ఆరోగ్య శాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో మొత్తం యాక్టివ్‌ కేసుల క్షీణత 11,121గా నమోదయిందని పేర్కొంది. ప్రస్తుతం ప్రతి పదిలక్షల జనాభాకు యాక్టివ్‌ కేసుల పరంగా చూస్తే భారత్‌లో  219 కేసులే ఉన్నాయంది.

ఆందోళన వద్దు..
బ్రిటన్‌లో గుర్తించిన కొత్త తరహా కరోనా వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. భారత్‌లోని వైరస్‌లో ఇప్పటివరకు అలాంటి ఉత్పరివర్తనం కనిపించలేదని తెలిపింది. అలాగే, ఆ వైరస్‌ వేరియంట్‌తో ప్రస్తుత టీకా ప్రయోగాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని నీతి ఆయోగ్‌(హెల్త్‌) సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు అందిన సమాచారంతో మేం జరిపిన అధ్యయనం మేరకు కొత్త రకం వైరస్‌పై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదమున్నందున మరింత జాగ్రత్తగా ఉండాలి. మాస్క్‌, భౌతిక దూరం, చేతుల పరిశుభ్రత తదితర జాగ్రత్తలు పాటించాలి’ అన్నారు. కోవిడ్‌ చికిత్స విధానంలో మార్పులేవీ ఉండవని స్పష్టం చేశారు. ఈ కొత్త వైరస్‌ను సూపర్‌ స్ప్రెడర్‌గా భావించవచ్చని,  దీనితో మరణాల రేటు పెరగదని తెలిపారు.  

తాజా మార్గదర్శకాలు 
కొత్త వైరస్‌ ముప్పు నేపథ్యంలో తాజా మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 23 వరకు యూకేలో పర్యటించిన ప్రయాణీకులంతా పాటించాల్సిన నిబంధనలను అందులో పేర్కొంది. యూకే నుంచి వచ్చే ప్రయాణీకులంతా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేసుకోవాలని, పాజిటివ్‌ తేలిన వారిని ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ కేంద్రంలో ప్రత్యేకంగా ఉంచాలని పేర్కొంది.  నాలుగు వారాల్లో యూకే నుంచి వచ్చిన విమానాలు, అందులోని ప్రయాణీకులు, సిబ్బంది వివరాలను బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ అధికారులు రాష్ట్రాలకు, ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వీలెన్స్‌ ప్రోగ్రామ్‌ అధికారులకు ఇవ్వాలని, యూకే నుంచి వచ్చిన ప్రయాణీకులంతా 14 రోజుల ట్రావెల్‌ హిస్టరీని సంబంధిత రాష్ట్రాలకు అందించాలని పేర్కొంది. 

తైవాన్‌లో 253 రోజుల తర్వాత తొలి కేసు
తైపీ: దాదాపు 253 రోజుల తర్వాత తైవాన్‌లో స్థానికంగా ఓ మహిళ(30)కు కోవిడ్‌ సోకినట్టు గుర్తించారు. న్యూజిలాండ్‌కి చెందిన ఓ మిత్రుడి ద్వారా ఆమెకు కోవిడ్‌ సోకినట్టు తేలింది. బాధిత మహిళతో కలిసిన మరో 100 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రి తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement