ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచంలో బాధలను ఎవరూ తగ్గించలేరు, కానీ మనం చేయగలిగినంత మంచి చేయాలి.. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి నోటి నుంచి వెలువడిన ఆణిముత్యం లాంటి మాట ఇది. మాటే కాదు.. ఆయన మనసూ స్వచ్ఛమే.
విజయ్ కుమార్ చాన్సోరియా.. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని ఖాందియాలో ప్రభుత్వ టీచర్‌గా పని చేశారు. 39 సంవత్సరాల సర్వీస్ తర్వాత ఈ మధ్యే ఆయన సర్వీస్ నుంచి దిగిపోయారు. సోమవారం ఆయన ఉద్యోగ విరమణ సన్మానం జరిగింది. ఆ సన్మాన కార్యక్రమంలో పీఎఫ్, సేవింగ్స్ ద్వారా వచ్చిన 40 లక్షల రూపాయల్ని పేద విద్యార్థులకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారాయన.
భార్యతో విజయ్ కుమార్ సార్
ఉపాధ్యాయుడిగా వేలాదిమందిని తీర్చిదిద్దినప్పటికీ అది నాకు సంతృప్తినివ్వలేదు. వారి కోసం ఇంకేదో చేయాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పారాయన. రిక్షా తొక్కి, పాలు అమ్మి చదువుకున్నా. నాలాగే ఎంతో మంది ఇప్పటికీ కష్టపడుతున్నారు. చదువంటే ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు నాలాంటి కష్టం రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా అని ప్రకటించగానే.. అంతా చప్పట్లతో ఆయన్ని స్వాగతించారు.
అంతమాత్రాన ఆయనకు భార్యాపిల్లలు లేరనుకోవడం పొరపాటే. అక్కడ చప్పట్లు కొట్టిన వాళ్లలో ఆయన భార్యా, కూతురూ ఉన్నారు కూడా. విజయ్ కుమార్ భార్య బాగానే చదువుకుంది. ఆయన కూతురికి ఆల్రెడీ పెళ్లైంది. ఇద్దరు కొడుకులూ ఉద్యోగాలు చేస్తూ మంచిగానే సెటిల్ అయ్యారు. వాళ్ల అనుమతితోనే తాను ఇన్నాళ్లుగా దాచుకున్న పీఎఫ్, గ్రాట్యుటీ నిధులను పేద విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు విజయ్ కుమార్ చాన్సోరియా.
Comments
Please login to add a commentAdd a comment