
ఢిల్లీలోని గురుద్వారా రకాబ్‌గంజ్ సాహిబ్‌లో ప్రార్థనలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆకస్మికంగా ఢిల్లీలోని గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్‌ను సందర్శించారు. అక్కడ 9వ సిఖ్ గురు అయిన గురు తేగ్ బహదూర్‌కు నివాళులర్పించారు. గురు తేగ్ బహాదూర్ అంతిమ సంస్కారాలు గురుద్వారా రకాబ్ గంజ్‌లోనే జరిగాయి. పార్లమెంట్ హౌస్ దగ్గరలోని గురుద్వారాకు ప్రధాని ఆకస్మికంగా రావడంతో ఎలాంటి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయలేదు. సామాన్యుల రాకపోకలపై ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించలేదు. ‘శ్రీ గురు తేగ్‌బహదూర్ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు జరిగిన చరిత్రాత్మక గురుద్వారా రకాబ్ గంజ్‌లో ఈ ఉదయం ప్రార్థనలు చేశాను. శ్రీ గురు తేగ్ బహదూర్ దయార్ద్ర జీవితంతో స్ఫూర్తి పొందిన వేలాదిమందిలో నేనూ ఒకడిని’ అని గురుద్వారా సందర్శన అనంతరం మోదీ ట్వీట్ చేశారు.
పంజాబీలోనూ ఆయన ఈ ట్వీట్ చేశారు. హిందూ మతాన్ని రక్షించే క్రమంలో గురు తేగ్ బహదూర్ ప్రాణాలర్పించారని, సౌభ్రాతృత్వ భావనను విశ్వవ్యాప్తం చేశారని ప్రధాని కొనియాడారు. తమ ప్రభుత్వ హయాంలోనే గురు తేగ్ బహదూర్ 400వ ప్రకాశ పర్వ్ కార్యక్రమం రావడం ఎంతో ఆనందదాయకంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని ప్రధాని మోదీ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. తమ ఆదేశాలను ధిక్కరించారని పేర్కొంటూ గురు తేగ్ బహదూర్‌కు మొఘల్ రాజు ఔరంగజేబు మరణ శిక్ష విధించారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు, ప్రధానంగా పంజాబ్, హరియాణాలకు చెందిన సిఖ్ రైతులు ఢిల్లీ శివార్లలో మూడు వారాలకు పైగా నిరసన తెలుపుతున్న సమయంలో ప్రధాని ఢిల్లీలోని ప్రముఖ గురుద్వారాను సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment