ఆటుపోట్లు తట్టుకుని.. ఎదురుదెబ్బలు కాచుకుని ముదిమిలోనూ జీవన సమరం.నలుగురికీ ఆదర్శంగా శ్రమైక జీవనం.. నేటికీ నవ యువకుల్లా పనుల్లో నిమగ్నం. నేడు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మలిసంధ్యలో ఉదయరాగాలు పంచుతున్న అవిశ్రాంత శ్రామికుల జీవన పరిచయం.. నేటి యువత కోసం..
టైలర్ రామయ్య
కుట్టుమిషన్‌ను టకటకలాడిస్తూ బట్టలు కుడుతున్న ఈయన పేరు సంగ నర్సింహరాములు (80). వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో శ్రీరామ్ టైలర్స్ అంటే ఒకప్పుడు చాలా ఫేమస్. మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి తదితరులు ఈయనకు రెగ్యులర్ కస్టమర్స్. కొందరు ప్రముఖులు ఈయనను హైదరాబాద్ తీసుకెళ్లి ఈయన ద్వారానే మంచి బట్టలు కొని మరీ కుట్టించుకునేవారు. ఈ వృత్తి మీదనే ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేశాడు. పదహారేళ్లకే కుట్టుమిషన్ ఎక్కిన ఈయన భార్య మృతితో కొంతకాలం వృత్తికి దూరమయ్యాడు. కొడుకుల వద్ద ఉన్నా.. కూర్చుని తినడానికి మనసొప్పలేదు. అదిగో.. అప్పట్నుంచీ ఇలా.. ఓ డబ్బా పెట్టుకుని వృత్తిని కొనసాగిస్తూ చేతనైనంత సంపాదిస్తున్నాడు.
ఇప్పటోళ్లు ఫారం కోళ్ల లెక్కుండ్రు
చేతికి ఊతకర్ర.. భుజాన సంచితో కూరగాయలు అమ్మడానికి ఉదయం ఐదు గంటలకే నూట ఐదేళ్ల (105) కంచం బాలవ్వ బయల్దేరింది. తాను కొని తెచ్చుకున్న కూరగాయలను దుబ్బాక పట్టణంలో దాదాపు మూడు గంటల పాటు ఇంటింటికీ తిరిగి అమ్మింది. దారిలో ఎదురుపడిన ఓ పరిచయస్తురాలు ‘ఏం అవ్వా.. ఇంట్లో కూసోరాదే..’ అంటే.. ‘పాలపండ్లొచ్చినయ్ సూడు.. నేను పెద్దదాన్నెట్లయిత?’ అంటూ హాస్యమాడింది. ఆమెను పలకరిస్తే.. ‘ముగ్గురు బిడ్డలు, కొడుకు. ఎవరి పని వారిది. ఖాళీగా ఉండబట్టలేక ఈ పనిసేత్తున్న.. నా ఖర్చులు పోను బిడ్డలకూ ఇంత ఇస్తా..’ అని ఉత్సాహంగా చెప్పింది. బాలవ్వ శనివారం మాత్రం అంగడి వేస్తుంది. మీరు చూస్తున్న పై చిత్రం అదే. ‘దుబ్బాకలో అందరికంటే పెద్దదాన్ని నేనే. ఇప్పటోళ్లు మెత్తటి మనుషులు. ఫారం కోళ్ల లెక్కుండ్రు’ అంటున్న బాలవ్వలో అలుపనేదే లేదు.
అప్పు తీర్చేందుకని..
80 ఏళ్ల ఉప్పలమ్మ వరంగల్ అర్బన్ జిల్లా ఉర్సు, కరీమాబాద్‌లోని వాడవాడలా అడుగులో అడుగేసి తిరుగుతూ నిత్యం చీపురుకట్టలు అమ్ముతుంటుంది. భర్త, కుమారుడు చిన్న వయసులోనే చనిపోగా, ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసింది. పక్షవాతం రాగా, బిడ్డలకు భారం కాకూడదని రూ.25 వేలు అప్పుచేసి వైద్యం చేయించుకుంది. ఆ అప్పు తీర్చేందుకు ఇలా చీపుర్లు అమ్ముతోంది. అడిగితే అమ్మానాన్న డబ్బులివ్వలేదని, చిన్న అప్పుకే ప్రాణాలు తీసుకుంటున్న ఈ రోజుల్లో ఉప్పలమ్మను చూస్తే ఎలా నిలబడాలో తెలుస్తుంది కదా!.
మగ్గం ముంగిట ‘ముత్యం’
ఉత్సాహంగా మగ్గం నేస్తున్న ఈయన పేరు భోగ ముత్యాలు. ఐదో తరగతిలోనే చదువు మానేశాడు. పదమూడేళ్లప్పుడు పట్టుకున్న మగ్గాన్ని నేటికీ వదల్లేదు. ఇప్పుడు వయసు 86. రేడియోలో పాత పాటలింటూ ఇప్పటికీ రోజూ 7 –8 గంటలు పనిచేస్తాడు. 2 నెలల్లో వార్పు (8 చీరలు) నేసి పదివేలు సంపాదిస్తాడు. కొడుకులు, కూతుళ్లు ఉన్నా.. ‘ఎవరిపై ఆధారపడటం ఇష్టంలేదు. ఒంట్లో సత్తువుంది. వచ్చిన పని చేసుకుంటున్న. నేను సంపాదించేది నాకు, నా ఇంటావిడకు సరిపోతుంది’ అని చెప్పాడు.
‘సాగు’నంత కాలం చేస్తా..
పొలం పనుల్లో ఉన్న ఈ రైతు పేరు కట్కూరి మల్లారెడ్డి. కరీంనగర్ జిల్లా రామంచకు చెందిన ఈ యన వయసు డెబ్బై పైమాటే. పదేళ్లకే అరకపట్టాడు. పిల్లలు పెళ్లయి వేర్వేరుచోట్ల ఉం టున్నారు. ఈయన మాత్రం సొంతూరి ని, సేద్యాన్ని వీడలేదు. ఏ పనైనా తానే చేసుకుంటాడు. ఇంటి పక్కనే ఎకరన్నర, 2 కి.మీ.దూరంలో రెండెకరాలు ఉన్నాయి. అక్కడికీ ఇక్కడి కీ కాలినడకన రోజుకు రెండు మూడుసార్లు తిరుగుతాడు. ‘ఇష్టమైన పని సా గినంత కాలం చేస్తా’ అన్నాడు.
మట్టిమనిషి మల్లవ్వ
పారపట్టి గట్లు చదునుచేస్తున్న ఈ అవ్వ పేరు సిరివెల్ల మల్లవ్వ. 80 ఏళ్ల వయసులోనూ రెక్కల కష్టం చేస్తున్న ఈమెకు ముగ్గురు కుమారులు. భర్త, ఇద్దరు కుమారులు చనిపోయారు. మిగిలిన ఒక్క కొడుకు మంచానపడ్డాడు. దీంతో అన్నీతానై తన 20 గుంటల పొలంలో సేద్యం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన ఈమె ‘భర్త పోయినంక అంతా తలకిందులయ్యె. కొడుకు కోసం తప్ప దు కదా’ అంటూ పనిలో నిమగ్నమైంది.
ఎనిమిది పదుల యువకుడు
మొక్కలకు పాదులు తీస్తున్న ఈ యన బుర్ర పెద్దనర్సింహ. వయ సు 83. యాదాద్రి జిల్లా కక్కిరేణికి చెందిన ఈయన ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసి.. కొడుకులకు మూడెకరాలను రాసిచ్చేశాడు. భార్య దుర్గమ్మతో కలిసి వేరుగా ఉంటూ.. శ్రమతో జీవితాన్నినెట్టుకొస్తున్నాడు. ఎందుకింత కష్టమని అడిగితే,‘పదేళ్లప్ప టి నుంచే ఆసాముల దగ్గర జీతాలుండి గంజి, గటుక తిని బతికా. పని చేసే సత్తువుంది. ఖాళీగా కూర్చుంటే ఎలా..’ అన్నాడు.
బందెల్లి చాయ్.. సూపర్ భాయ్
చాయ్ తయారీలో నిమగ్నమైన ఈ యన పేరు పక్కిరి బందెల్లి (79). సంగారెడ్డి జిల్లా తాటిపల్లిలో 50 ఏళ్లుగా టీ దుకాణం నడుపుతున్నాడు. ఆరుగురు కూతుళ్లు, నలుగురు కుమారులు. వీరితోపాటు ఇద్ద రు మనవలు, ఇద్దరు మనవరాళ్ల్ల పెళ్లి ళ్లు సైతం చాయ్ దుకాణంపై వచ్చిన డబ్బులతోనే చేశాడు. వారి పిల్లలనూ తానే చదివిస్తున్నాడు. మొదట్లో ఏడు పైసలకు చాయ్ అమ్మేవాడు. తెల్లవారుజాము 4 నుంచి రాత్రి 9 వరకు దుకాణం నడుపుతాడు. భార్య, చిన్న కుమారుడు ఇస్మాయిల్ చేదోడువాదోడుగా ఉంటున్నారు. ‘అప్పట్ల ఏడు పైసలంటేనే గొప్ప.. పదేండ్ల నుంచి పట్నపోల్లు వచ్చి రకరకాల చాయ్‌లు అడుగుతున్నరు.. వాటిని చేసిస్తున్నా.. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పనిచేస్తా’ అని బందెల్లి అంటున్నాడు.
‘తాడి’ని తలదన్నుతా..
ఆకాశాన్నంటినట్టున్న తాడిచెట్టును అవలీలగా ఎక్కేస్తున్న ఈయన పేరు రాములు. వయసు 78. ‘ముదిమి మీదపడింది కదాని ముడుచుకుని కూచుంటామా?. కొడుకులు వద్దంటరు. కానీ ఉత్తగా కూసుని తినలేక నాకొచ్చిన పని చేత్తున్న. పిల్లలందరికీ పెళ్లిళ్లయినయి. మనవలు, మనవరాళ్లున్నరు. కులవృత్తిపై మమకారంతోనే ఇదంతా..ఇప్పటికీ నా సంతానంపై ఆధారపడి లేను. కల్లు అమ్మితే రోజుకు రూ.300 వస్తాయి. అవి చాలు’ అని చెప్పాడు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తిర్మలాపురానికి చెందిన ఈయన. ‘రాములు ఏ కాలంలోనైనా, అదీ చాలా ఎత్తున్న తాడిచెట్లనైనా ఇట్టే ఎక్కేస్తాడ’ని అక్కడే ఉన్న కొందరు గ్రామస్తులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment