JOMO: It's Time to Embrace the Joy of Missing Out, Here's Why - Sakshi
Sakshi News home page

Jomo The Joy Of Missing Out: తమ ఇష్టాలను పిల్లలపై రుద్దుతున్న పేరెంట్స్‌.. ట్రెండ్‌ మార్చుకుంటున్న యువత

Published Wed, Aug 2 2023 11:04 AM | Last Updated on Wed, Aug 2 2023 12:19 PM

Here Is Why Its Time To Embrace Jomo The Joy Of Missing Out - Sakshi

యువతలోని ఒక వర్గం నుంచి బలంగా వినిపిస్తున్న నినాదం... జాయిన్‌ ది జోమో క్లబ్‌! ఒకప్పుడు ఫోమో(ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ ఔట్‌) క్లబ్‌లో ఉన్నవారు కూడా జోమో (జాయ్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ ఔట్‌) లోకి వచ్చేస్తున్నారు. మెయిన్‌స్ట్రీమ్‌ ధోరణికి భిన్నంగా కలలు కనే ‘జోమో’ ట్రెండ్‌ యువతరం ‘సక్సెస్‌తో సంతోషం వస్తుందో లేదో గాని సంతోషంతో మాత్రం తప్పనిసరిగా సక్సెస్‌ వస్తుంది’ అంటోంది...

రాజస్థాన్‌లోని కోట నగరం ‘కోచింగ్‌ హబ్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరుగాంచింది. తియ్యటి భవిష్యత్‌ కలలతో పాటు పీడకలలలాంటి ఒత్తిడి, భయం, ఆందోళన ఆ గాలిలోనే తేలియాడుతుంటాయి.ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అజిత్‌ కిశోర్‌ ఐఐటీ కోంగ్‌ కోసం ఇక్కడికి వచ్చాడు. తండ్రికి చెరుకుకు సంబంధింన ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీ ఉంది. ఐఐటీ–కాన్పూర్‌లో చదివిన అజిత్‌ సోదరుడు అమెరికాలో సెటిల్‌ అయ్యాడు. ఈ నేపథ్యంలో తనకు మరో ‘ఐఐటీ పుత్రుడు’ కావాలనుకున్నాడు తండ్రి. ఫలితంగా అజిత్‌ కిశోర్‌ కోట నగరానికి అనివార్యంగా రావాల్సి వచ్చింది.అజిత్‌ కిశోర్‌కు ఐఐటీ అంటే బొత్తిగా ఇష్టం లేదు.‘ఆసక్తి లేకపోవడం కాదు, అందుకు తగిన ప్రతిభాసామర్థ్యాలు నాలో లేవు. నాకు సంబంధం లేని విషయానికి నేనేందుకు బాధ పడాలి?’ అంటాడు అజిత్‌.



తరచు కోచింగ్‌ క్లాసులు ఎగ్గొట్టే బిహార్‌లోని పట్నాకు చెందిన రక్షిత్‌ కుమార్‌ ‘నాకు ఐఐటీ సీటు కచ్చితంగా రాదు. అయినా సరే, నటించక తప్పదు’ అని నవ్వుతూ అంటాడు. ‘దీనివల్ల టైమ్, డబ్బు వృథా కదా?’ అని అడిగితే రక్షిత్‌ ఇలా జవాబు ఇస్తాడు...‘నేను చదువులో యావరేజ్‌ స్టూడెంట్‌ని. మా నాన్నకేమో నేను ఇంజినీర్‌ కావాలని పట్టుదల. ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలనేది నా కల. ఈ విషయాన్ని నాన్నకు చెబితే ఐఏఎస్‌ ఆఫీసర్‌ కొడుకు టైలర్‌ కావాలనుకుంటాడా? అని వెటకారంగా మాట్లాడారు. నిన్ను ఇంజినీర్‌గా చూడాలనేది నా కల. ఏం చేస్తావో, ఎలా చేస్తావో తెలియదు అని ఆర్టర్‌ జారీ చేశారు. కాబట్టి ఆయన మనసు నొప్పించకుండా ఇక్కడకు రావాల్సి వచ్చింది’



మధ్యప్రదేశ్‌ నుంచి కోట నగరానికి వచ్చిన అదితిశర్మ తండ్రి డెంటిస్ట్‌. తల్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ‘నా తల్లిదండ్రుల కలల బాధితురాలిని’ నవ్వుతూ అంటుంది అదితి. ‘ఎందుకలా?’ అని అడిగితే... ‘నా తల్లిదండ్రులు చదువులో బ్రైట్‌. నేను మాత్రం బ్రైట్‌ స్టూడెంట్‌ కాలేకపోయాను. అందుకు నేనేమీ బాధ పడడం లేదు. చెఫ్‌ కావాలనేది నా కల’ అంటుంది అదితి.అదితి శర్మలాగే ‘కోట మాత్రమే ప్రపంచం కాదు. దీనికి అవతల పెద్ద ప్రపంచం ఉంది. అక్కడ మనకు తగిన అద్భుత అవకాశాలు ఉంటాయి’ అనుకునే విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. కోట లాంటి కోంగ్‌ సెంటర్‌లకు ప్రసిద్ధిగాంచిన నగరాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అదితిశర్మలాంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు.

అదితి శర్మలాంటి వాళ్లను ఆకట్టుకుంటున్న ట్రెండ్‌... జోమో. ఫోమో (ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ ఔట్‌–తప్పిపోతుందేమో అనే భయం) పాత విషయం అయిపోయింది. జోమో (జాయ్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ ఔట్‌–తప్పిపోయినందుకు ఆనందం) అనేది కొత్త ట్రెండ్‌గా మారింది. యూత్‌లో కొంతమంది నుంచి వినిపిస్తున్న ‘జాయిన్‌ ది జోమో క్లబ్‌’ నినాదాన్ని ఎలా చూడాలి?పలాయనవాదమా? కాలహరణమా? ‘చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఆదేశించగానే ఓకే చెబుతారు. తాము సాధించగలం అనుకుంటారు. ఒకసారి వృత్తంలోకి వచ్చిన తరువాత పేరెంట్స్, ఉపాధ్యాయులు, ఇతరుల నుండి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వచ్చే ఒత్తిడితో సతమతమవుతారు.

ఆ తరువాత పరిణామాలు ఎటో వెళతాయి. మొదటికే మోసం వస్తుంది. తల్లిదండ్రుల కలను నెరవేర్చలేకపోతున్నాను అనే బాధతో ఆత్మహత్యకు పాల్పడే వాళ్లు కూడా ఉన్నారు. దీని కంటే జోమో నయం కదా! జోమో బాయ్స్‌ అండ్‌ గర్ల్స్‌ తమ బలాలు, బలహీనతల విషయంలో చాలా స్పష్టంగా ఉంటున్నారు. ఇఫ్‌ ఐయామ్‌ హ్యాపీ ఐయామ్‌ సక్సెస్‌ఫుల్‌. సక్సెస్‌ అంటే అకాడమిక్, ప్రొఫెషన్‌ సక్సెస్‌ మాత్రమే కాదు’ అంటూ జోమోవాదులను సమర్థించేవాళ్లు ఎంతోమంది ఉన్నారు.‘జోమో’ కెరీర్‌కే పరిమితమైన ట్రెండ్‌ కాదు. సోషల్‌మీడియాలోని అనేక అంశాలు ఈ ట్రెండ్‌ బలపడడానికి కారణం.‘సోషల్‌ మీడియాలో భాగం కాకపోతే, చురుగ్గా ఉండకపోతే అందరిలా ఎగై్జట్‌మెంట్‌ను మిస్‌ అవుతాను, ఒంటరిని అవుతానేవె అనే భయం... ఫోమో.

మరోవైపు జోమో మాత్రం అలాంటి భయాలను పక్కనపెడుతుంది. టెక్‌–ఫ్రీ బ్రేక్స్‌ను ఇష్టపడుతుంది’ అంటుంది దిల్లీకి చెందిన సీనియర్‌  క్లినికల్‌ సైకాలజిస్ట్‌ భావనా బర్మీ. రెండు సంవత్సరాల క్రితం ట్రావెల్‌ ఇండస్ట్రీలో ‘జోమో’ ట్రెండ్‌ గట్టిగా వినిపించింది, ఈ ట్రెండ్‌లో భాగంగా ఆఫ్‌ సీజన్, జనసమూహాలు ఎక్కువగా కనిపించని, పెద్దగా జనాదరణ లేని ప్రదేశాలను ఎంచుకునేవారు. స్థూలంగా చెప్పాలంటే ఇది ఒకే రంగానికి, ఒకే అంశానికి పరిమితమైన ట్రెండ్‌ కాదు.

సోషల్‌ మీడియాలో భాగం కాకపోతే, చురుగ్గా ఉండకపోతే అందరిలా ఎగై్జట్‌మెంట్‌ను మిస్‌ అవుతాను, ఒంటరిని అవుతానేమో అనే భయం... ఫోమో. మరోవైపు జోమో మాత్రం అలాంటి భయాలను పక్కనపెడుతుంది. టెక్‌–ఫ్రీ బ్రేక్స్‌ను ఇష్టపడుతుంది.
– భావనా బర్మీ, 
క్లినికల్‌ సైకాలజిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement