న్యూఢిల్లీ: వివిధ టీవీ చానళ్లకు చెందిన కొందరు జర్నలిస్టులు/యాంకర్లు నిర్వహించే కార్యక్రమాలకు, వేదికలకు తమ ప్రతినిధులను పంపించకూడదని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి మీడియా కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్(ఎన్‌బీడీఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి నిర్ణయం ఆందోళనకరమని ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నడుచుకోవడం సరైంది కాదని పేర్కొంది.
గతంలో ఇలాంటి పరిణామం ఎనాడూ సంభవించలేదని గుర్తుచేసింది. ప్రమాదకరమైన ఈ ధోరణిని మానుకోవాలని ఇండియా కూటమికి విజ్ఞప్తి చేసింది. మీడియా స్వేచ్చను గౌరవించాలని కోరింది. కొందరు జర్నలిస్టులను/యాంకర్లను బహిష్కరించడం అనేది దేశాన్ని అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) నాటి రోజుల్లోకి తీసుకెళ్తుందని ఎన్‌బీడీఏ స్పష్టం చేసింది. మీడియాపై విరుచుకుపడితే స్వతంత్ర భావాల వ్యక్తీకరణను, గొంతుకలను అణచివేసినట్లే అవుతుందని తెలియజేసింది. ఈ బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇండియా కూటమికి సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment