మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్య | NCP Leader Baba Siddiqui Shot in Mumbai | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్య

Published Sun, Oct 13 2024 7:07 AM | Last Updated on Mon, Oct 14 2024 9:20 AM

NCP Leader Baba Siddiqui Shot in Mumbai

ముంబైలో కుమారుడి  కార్యాలయం వద్ద ఘటన 

మూడు రౌండ్లు  కాల్చిన దుండగులు  

ఇద్దరు నిందితుల అరెస్టు.. 

తామే హత్య చేసినట్లు   ప్రకటించిన బిష్ణోయ్‌ గ్యాంగ్‌  

దావూద్‌ ఇబ్రహీం ముఠాతో సంబంధాలున్నా వదిలిపెట్టమని హెచ్చరిక

ముంబై/న్యూఢిల్లీ:  బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌తో ఉన్న స్నేహ సంబంధాలు మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పారీ్ట(అజిత్‌పవార్‌) సీనియర్‌ నేత బాబా సిద్దిఖీని బలి తీసుకున్నాయి. రాజస్తాన్‌లో బిష్ణోయ్‌ తెగ ప్రజలు పరమ పవిత్రంగా భావించే కృష్ణ జింకలను వేటాడినందుకు సల్మాన్‌పై కక్షగట్టిన లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా ఆయన సన్నిహితుడు సిద్దిఖీని దారుణంగా హత్య చేసింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో దసరా పండుగ రోజే జరిగిన ఈ హత్యాకాండ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

ముంబై బాంద్రా ఈస్ట్‌ ప్రాంతంలోని నిర్మల్‌ నగర్‌లో బాబా సిద్దిఖీ కుమారుడు, మహారాష్ట్ర ఎమ్మెల్యే జీషాన్‌ సిద్దిఖీ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి 9.30 గంటలకు ముగ్గురు యువకులు ముఖాలకు కర్చీఫ్‌లు ధరించి, కార్యాలయం ప్రాంగణంలోకి దూసుకొచ్చారు. అక్కడే ఉన్న బాబా సిద్దిఖీపై 9.9 ఎంఎం పిస్తోల్‌ గురిపెట్టారు. మూడు రౌండ్లు కాల్పులు జరిపి, వెంటనే పరారయ్యారు.

నగరంలో పండుగ సందర్భంగా టపాసుల మోత వల్ల ఈ కాల్పుల శబ్ధం బయటకు వినిపించలేదు. 66 ఏళ్ల సిద్దిఖీ కడుపు, ఛాతీలోకి తూటాలు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తీవ్రంగా రక్తస్రావం జరిగింది. లీలావతి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించినట్లు రాత్రి 11.27 గంటలకు డాక్టర్లు నిర్ధారించారు.   

హత్య చేసింది మేమే..  
1998 సెప్టెంబర్‌లో రాజస్తాన్‌లోని జోద్‌పూర్‌ సమీపంలో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సల్మాన్‌ ఖాన్‌ ఆటవిడుపుగా కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు ఆయనకు బెయిల్‌ ఇచి్చంది. కృష్ణ జింకలను చంపేసినందుకు సల్మాన్‌ ఖాన్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఆయన మిత్రులను వేటాడడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే బాబా సిద్దిఖీని హత్య చేశామని ప్రకటించింది. 

శనివారం రాత్రి సిద్దిఖీ హత్య జరగ్గా, ఆదివారం ఫేసుబుక్‌లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా సభ్యుడు శిబూ లోంకర్‌ అలియాస్‌ శుభం రామేశ్వర్‌ లోంకర్‌ పేరిట ఓ పోస్టు ప్రత్యక్షమైంది. సల్మాన్‌ ఖాన్‌కు మిత్రుడు కావడంతోపాటు దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌తో సంబంధాలు కొనసాగిస్తుండడం వల్లే సిద్దిఖీని హత్య చేశామని లోంకర్‌ తేలి్చచెప్పారు. సల్మాన్‌కు సహకరిస్తే ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సల్మాన్‌ ఖాన్‌తోపాటు దావూద్‌ ఇబ్రహీం ముఠాతో సంబంధాలు కొనసాగిస్తే సిద్దిఖీకి పట్టిన గతే పడుతుందని స్పష్టం చేశారు. అలాగే తమ ముఠా సభ్యుడైన అనూజ్‌ థపన్‌ మరణానికి కారణమైన వారిని శిక్షించామని పేర్కొన్నారు.  

కాంట్రాక్టు హంతకుల పనే  
బాబా సిద్దిఖీపై కాల్పులు జరిపినవారిలో ఇద్దరిని గుర్మెయిల్‌ బల్జీత్‌ సింగ్‌(23), ధరమ్‌రాజ్‌ రాజేశ్‌ కాశ్యప్‌(19)గా పోలీసులు గుర్తించారు. ధరమ్‌రాజ్‌ను ఉత్తరప్రదేశ్‌లో, బల్జీత్‌ సింగ్‌ను హరియాణాలో అరెస్టు చేశారు. లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా సభ్యులమని దర్యాప్తులో వారు అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. గత నెల రోజులుగా సిద్దిఖీ కదలికలపై కన్నేసి, పథకం ప్రకారం హత్య చేసినట్లు నిందితులు వెల్లడించారు. సిద్దిఖీపై మూడు రౌండ్లు కాల్పులు జరపగా, ఒకటి ఆయన ఛాతీలోకి, మరొకటి కడుపులోకి దూసుకెళ్లింది. మరొకటి గురి తప్పడంతో సిద్దిఖీ కారు విండ్‌షీల్డ్‌ ధ్వంసమైంది.

 కాల్పులు జరిపినవారిలో మూడో నిందితుడు శివ కుమార్‌ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ హత్యాకాండతో మరో నిందితుడి ప్రమేయం ఉందని, అతడిని మొహమ్మద్‌ జీషాన్‌ అఖ్తర్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. వీరంతా కాంట్రాక్టు హంతకులేనని తెలిపారు.సిద్దిఖీని హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చున్న నిందితులు అడ్వాన్స్‌ తీసుకున్నారని, కొద్దిరోజుల క్రితమే ఆయుధాలు సమకూర్చుకున్నారని వివరించారు. హత్య జరిగిన సమయంలో సిద్దిఖీ సమీపంలో ఒక కానిస్టేబుల్‌ ఉన్నాడని చెప్పారు. నిందితుల నుంచి రెండు పిస్తోళ్లు, 28 తూటాలు స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. 

పోలీసు కస్టడీకి నిందితుడు   
బాబా సిద్దిఖీ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం ముంబై కోర్టులో హాజరుపర్చారు. మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ వైరంతో ఈ హత్య జరిగిందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో కుట్ర ఏదైనా జరిగిందా? అనేది తేల్చాల్సి ఉందన్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. నిందితుల్లో ఒకడైన హరియాణా వాసి గుర్మెయిల్‌ బల్జీత్‌ సింగ్‌(23)ను ఈ నెల 21 దాకా పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తాను మైనర్‌నని మరో నిందితుడు వాదించాడు. దాంతో అతడికి వయసు నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం తమ ఎదుట హాజరుపర్చాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.  

ఏమిటీ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌?  
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో జన్మించిన లారెన్స్‌ బిష్ణోయ్‌(33) అనే గ్యాంగ్‌స్టర్‌ ఈ ముఠాను ఏర్పాటు చేశాడు. చండీగఢ్‌లో విద్యార్థి రాజకీయాల ద్వారా నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. అతడిపై 20కిపైగా కేసులున్నాయి. ముఠాలో దాదాపు 700 మంది షూటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరు అందరికీ తెలిసింది. 2023 నవంబర్‌లో మరో పంజాబీ గాయకుడు గిప్పీ గ్రేవాల్‌ నివాసం వద్ద ఈ ముఠా కాల్పులు జరిపింది. సల్మాన్‌ ఖాన్‌ను సోదరుడు అని సంబోధించినందుకు గ్రేవాల్‌ను టార్గెట్‌ చేసినట్లు ప్రకటించింది. గత నెలలో కెనడాలో గాయకుడు ఎ.పి.థిల్లాన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించింది.  ప్రస్తుతం దేశ విదేశాల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. బిష్ణోయ్‌ ప్రస్తు తం గుజరాత్‌లో సబర్మతి జైలులో ఉన్నాడు.

నివాళులర్పించారు. సల్మాన్‌ ఖాన్‌ తన మిత్రుడు బాబా సిద్దిఖీపై జరిగిన హత్యాయత్నం గురించి తెలిసిన వెంటనే సల్మాన్‌ ఖాన్‌ లీలావతి హాస్పిటల్‌కు వచ్చారు. సిద్దిఖీ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు. ఆదివారం సాయంత్రం బాంద్రాలోని సిద్దిఖీ అపార్టుమెంట్‌ వద్దకు సల్మాన్‌ చేరుకున్నారు. సిద్దిఖీ మృతదేహం వద్ద నివాళులర్పించారు. సల్మాన్‌ కుటుంబ సభ్యులైన సోహైల్‌ ఖాన్, షురా ఖాన్, అరి్పతాఖాన్‌ శర్మ, అల్విరా అగి్నహోత్రి, సల్మాన్‌ స్నేహితురాలు లులియా వంతూర్‌తోపాటు పలువురు బాలీ వుడ్‌ ప్రముఖులు సైతం నివాళులరి్పంచారు.  

హత్య వెనుక వ్యాపార విభేదాలు?  
సల్మాన్‌తో సంబంధాలు ఉన్నందుకు బాబా సిద్దిఖీని తామే హత్య చేసినట్లు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటించినప్పటికీ, వ్యాపార విభేదాలు కారణం కావొచ్చని ప్రచారం సాగుతోంది. 2000 నుంచి 2004 దాకా మహారాష్ట్ర హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా పనిచేశారు. అప్పట్లో మురికివాడ పునరావాస ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో రూ.2 వేల కోట్ల దాకా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. 2014లో సిద్దిఖీతోపాటు మరికొందరిపై కేసు నమోదైంది. 2018లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సిద్దిఖీకి చెందిన రూ.462 కోట్ల ఆస్తులను ఆటాచ్‌ చేసింది. వ్యాపార గొడవల కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.  

దుండగులను కఠినంగా శిక్షిస్తాం: ఏక్‌నాథ్‌ షిండే  
బాబా సిద్దిఖీ హత్యాకాండపై మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌  సహా వివిధ పారీ్టల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సిద్దిఖీని పొట్టనపెట్టుకున్న దుండగులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు. దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ లీలావత్‌ హాస్పిటల్‌కు చేరుకొని వైద్యులతో మాట్లాడారు. తన విశ్వసనీయ సహచరుడు, సన్నిహి త మిత్రుడైన సిద్దిఖీ హత్యకు గురికావడం బాధాకరమని అజిత్‌ పవార్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటన వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. మైనారీ్టల సంక్షేమం, మత సామరస్యం కోసం సిద్దిఖీ నిరంతరం పోరాటం సాగించారని అజిత్‌ పవార్‌   కొనియాడారు.  

కార్యకర్త  నుంచి మంత్రి స్థాయికి..  
బాబా సిద్దిఖీ అలియాస్‌ జియా ఉద్దీన్‌ సిద్దిఖీ 1953 సెప్టెంబర్‌ 13న బిహార్‌ రాజధాని పాట్నాలో జని్మంచారు. బాల్యంలో కుటుంబంతోపాటు ముంబైకి వలస వచి్చ, అక్కడే పెరిగారు. రాజకీయాలపై ఆసక్తితో 1977లో కాంగ్రెస్‌ పారీ్టలో చేరారు. చురుకైన నాయకుడిగా పేరు సంపాదించారు. స్థానిక ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ తక్కువ కాలంలోనే పార్టీలో ఉన్నతస్థాయికి చేరుకున్నారు. 1980లో బాంద్రా యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లలో బాంద్రా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యారు. 1988లో ముంబై యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నియ్యారు. 

1992లో ముంబై మున్సిపల్‌ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. 1999లో తొలిసారిగా బాంద్రా వెస్ట్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు జయకేతనం ఎగురవేశారు. 2014 దాకా ఎమ్మెల్యేగా కొనసాగారు. 2004 నుంచి 2008 దాకా మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాల, కారి్మక శాఖ మంత్రిగా పనిచేశారు. రాజకీయ వర్గాలతోపాటు బాలీవుడ్‌ ప్రముఖులతో సిద్దిఖీకి చక్కటి సంబంధాలున్నాయి. ఆయన ఇచ్చే భారీ ఇఫ్తార్‌ విందులకు బాలీవుడ్‌ హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు హాజరయ్యేవారు. 

సల్మాన్‌ ఖాన్, షారుక్‌ ఖాన్, సంజయ్‌ దత్‌తో సిద్దిఖీ సన్నిహితంగా మెలిగేవారు. సల్మాన్, షారుక్‌ మధ్య ఐదేళ్లపాటు నెలకొన్న వివాదాన్ని స్వయంగా పరిష్కరించారు. ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి, ఎన్సీపీలో చేరారు. సిద్దిఖీ కుమారుడు జీషాన్‌ సిద్దిఖీ ప్రస్తుతం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. ముంబై ముస్లిం ప్రజల్లో గట్టి పట్టున్న బాబా సిద్దిఖీ రాకతో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ లబ్ధి పొందింది. ఇదిలా ఉండగా, కరోనా మహమ్మారి ఉధృతి సమయంలో బాబా సిద్దిఖీ అందించిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ప్రజలకు ప్రాణాధార ఔషధాలు, పీపీఈ కిట్లు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు.  

ఈ యుద్ధం మేము కోరుకోలేదు 
‘‘ఓం జైశ్రీరామ్, జైభారత్‌. జీవితం గురించి నాకు తెలుసు. నా దృష్టిలో ఆస్తులకు, మానవ శరీరానికి పెద్దగా విలువ లేదు. ఏది సరైందో అదే చేశాం. స్నేహం అనే బాధ్యతను గౌరవించాం. నిజానికి ఈ యుద్ధం మేము కోరుకోలేదు. కానీ, సల్మాన్‌ ఖాన్‌ వల్ల మా సోదరుడు అనూజ్‌ థపన్‌ ప్రాణాలు కోల్పోయాడు. మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. కానీ, సల్మాన్‌ ఖాన్‌కు, దావూద్‌ ఇబ్రహీంకు ఎవరైనా సహరిస్తే వారి లెక్కలు సరిచేస్తాం. గతంలో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద దావూద్‌తోపాటు సిద్దిఖీ కూడా నిందితుడే. 

మా సోదరుడు థపన్‌ మరణం, సల్మాన్, దావూద్‌తో సంబంధాలు, బాలీవుడ్, రాజకీయాల్లో భాగస్వామ్యం, ఆస్తుల సెటిల్‌మెంట్ల వ్యవహారాలే సిద్దిఖీ హత్యకు కారణం. మా సభ్యుల్లో ఎవరినైనా చంపేస్తే తగిన రీతిలో జవాబిస్తాం. మొదట దాడి మేము చేయం. ప్రత్యర్థులు దాడి చేస్తేనే ప్రతిస్పందిస్తాం. అమరులకు మా వందనాలు’’ అని ఫేసుబుక్‌ పోస్టులో లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా సభ్యుడు శిబూ లోంకర్‌  తేలి్చచెప్పాడు. ఈ పోస్టు సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  

అనూజ్‌ థపన్‌ మరణానికి ప్రతీకారం?  
సల్మాన్‌ ఖాన్‌కు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి గత కొన్నేళ్లుగా హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో ఆయనకు మహారాష్ట్ర పోలీసులు పటిష్టమైన భద్రత కలి్పస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బైక్‌పై వచి్చన ఇద్దరు వ్యక్తులు ముంబైలో సల్మాన్‌ ఇంటి ఎదుట తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఇద్దరిలో అనూజ్‌ థపన్‌ ఉన్నాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలో ఉన్న థపన్‌ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మే 1న ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ లాకప్‌లో శవమై కనిపించాడు. ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పగా, పోలీసులే చిత్రహింసలు పెట్టి చంపేశారని థపన్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. థపన్‌ మరణం పట్ల ప్రతీకారంతో రగిలిపోయిన బిష్ణోయ్‌ ముఠా బాబా సిద్దిఖీని అంతం చేసినట్లు ప్రచారం   సాగుతోంది.

 



ఇది కూడా చదవండి: డీయూ మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement