ముంబై: అసెంబ్లీ ఎన్నికల ముందు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇవాళ పలువురు అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు ఆ పార్టీకి గుడ్‌చెప్పి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(శరద్ పవార్) వర్గంలో చేరారు. అయితే ఈ క్రమంలో అజిత్ పవార్ సైతం శరద్ పవార్ వర్గంలో చేరుతారా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరందుకుంది.
అయితే అజిత్ పవార్.. తమ వర్గంలోకి తిరిగి రావాలని ఆసక్తి చూపిస్తే చేర్చుకోవటంపై ఇప్పటికే స్పష్టత ఇచ్చారు శరద్ పవార్. అజిత్ పవార్‌ను తమ వర్గంలో చేర్చుకునే విషయం తన చేతిలో లేదని, అటువంటి విషయంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
‘ప్రతి ఒక్కరికి తమ పార్టీలో స్థానం ఉంటుంది. అయితే ఈ విషయంలో మాత్రం పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇతర పార్టీలు నేతలను చేర్చుకోవటంలో నేను సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి లేదు. నాతోపాటు పార్టీ నేతలందరీని సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం’ అని శరద్ పవార్ పేర్కొన్నారు.
ఇక.. అజిత్ పవర్ వర్గానికి చెందిన పింప్రి చించ్వాడ్ ఎన్సీపీ యూనిట్ అధ్యక్షుడు అజిత్ గవానే, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాహుల్ భోసలే, స్టూడెంట్ వింగ్ చీఫ్ యష్ సానేతోపాటు, మాజీ కార్పొరేటర్లు రాహుల్ భోసలే, పంకజ్ భలేకర్ బుధవారం ఎన్సీపీ( శరద్ చంద్ర పవార్) వర్గంలో చేరారు. వీరంతా తమ పార్టీలో తిరిగి చేరటాన్ని శరద్ పవార్ స్వాగతించారు.
కాగా, శరద్ పవార్ గత నెలలో ‘తన పార్టీ నాశనాన్ని కోరుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వారిని ఆహ్వానించం. కానీ పార్టీ పరువును దెబ్బతీయకుండా బలోపేతం చేసేందుకు కృషి చేసే నాయకుల్ని తిరిగి చేర్చుకుంటాం’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే మరోమూడు నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో ఇవాళ పార్టీ మారిన నేతల నిర్ణయంతో అజిత్ పవార్ (ఎన్సీపీ) పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
ఎన్సీపీ శరద్ పవార్ వర్గంలో పలువురు నేతల చేరికపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే స్పందిచారు. ‘ప్రతిపక్షాలు సైతం శరద్ పవార్‌పై నమ్మకంతో తమ వర్గంలో చేరటానికి ఆసక్తి చూపుతున్నాయి. అందుకే పలువురు నేతలు తమ పార్టీలో చేరారు’ అని ఆమె అన్నారు. మరోవైపు.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అజిత్ పవార్ వర్గం 4 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఒక స్థానంలో మాత్రమే గెలిచింది.
ఇక.. గతేడాది 8 మంది రెబెల్ ఎమ్మెల్యేతో అజిత్ పవార్ ఎన్సీపీలో చీలిక తెచ్చి.. శివసేన (షిండే)వర్గం-బీజేపీ కూటమిలో ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంతో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment