
న్యూఢిల్లీ: కరోనా ఎలా వచ్చిందో, దేని ద్వారా వచ్చిందోననే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. చాలామంది ఈ వైరస్ చైనాలోని ఒక ల్యాబ్‌లో ఉత్పన్నమైందని భావిస్తున్నా, ఈ వాదనకు తగ్గ శాస్త్రీయ ఆధారాలు దొరకలేదు. అయితే ఈ వైరస్ ప్రకృతిలోనే సహజంగా ఉద్భవించిందని ద లాన్సెట్ జర్నల్‌లో కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు బయాలజిస్టులు, వైరాలజిస్టులు, డాక్టర్లు, ఎకాలజిస్టులు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు.
తాజాగా జరిపిన పరిశోధనల్లో వైరస్ ప్రకృతిసిద్ధంగా ఉత్పన్నమైందనేందుకు బలమైన సాక్ష్యాలు లభించాయని అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా ఈ వైరస్ ల్యాబ్ నుంచి వచ్చిందనేందుకు ఎలాంటి సైంటిఫిక్ సాక్ష్యాలు లేవని గుర్తు చేసింది. గతేడాది లాన్సెట్ ప్రచురించిన నివేదికలో సైతం ఈ బృందం ల్యాబ్ లీకేజీ వాదనలను తోసిపుచ్చింది.
పరిశోధన అవసరం: ల్యాబ్ లీకేజ్‌పై ఆరోపణలతో ఎలాంటి ప్రయోజనం లేదని, గబ్బిలాల నుంచి మనిషికి వైరస్ సోకిన విధానంపై పరిశోధన ద్వారానే తదుపరి ప్రమాదాలు నివారించగలమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో వాదోపవాదాలను పక్కనబెట్టి శాస్త్రీయ పరిశోధనా మార్గాన్ని అనుసరించినప్పుడే భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కోగలమని తెలిపారు. వైరస్ పుట్టుకపై శాస్త్రీయ పరిశోధన కోసం డబ్లు్యహెచ్‌ఓ, ఇతర సంస్థలు చైనా నిపుణులతో కలిసి లోతైన పరిశోధన సాగించాలని సూచించారు. ఈ విషయమై స్పష్టమైన వివరాలు తెలియడానికి సంవత్సరాలు పట్టవచ్చని, కానీ ప్రపంచ శాస్త్రీయ సమాజం తప్పక ఈపని చేయాలని తెలిపారు. అధ్యయనంలో బోస్టన్ యూనివర్సిటీ, మేరీలాండ్ యూనివర్సిటీ, గ్లాస్గోవ్ యూనివర్సిటీ, ద వెల్‌కమ్ ట్రస్ట్, క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీతో పాటు పలు సంస్థలకు చెందిన సైంటిస్టులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment