న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరో సంచలన ప్రకటనతో వార్తల్లో నిలిచారు. తన దేశం ‘కైలాస’లో రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక కరెన్సీని అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా.. ఈ కరెన్సీ చెల్లుబాటయ్యేలా ఇందుకు సంబంధించి వివిధ దేశాలతో పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. గణేశ్ చతుర్థి సందర్భంగా ఆగష్టు 22న హిందూ రిజర్వ్ బ్యాంకును స్థాపించడం సహా అదే రోజు నుంచి కరెన్సీని చెలామణిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలు అన్నీ పూర్తి చేశామని, పాలసీ డాక్యుమెంట్లు సిద్ధమయ్యాయని, చట్టబద్ధంగానే ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. (ఆ అక్కాచెల్లెళ్లు నిత్యానంద ‘కైలాస’లో..)
ఈ మేరకు పలు దేశాలతో ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నామని... ప్రపంచ దేశాల నుంచి విరాళాల రూపంలో వస్తున్న డబ్బును ఆర్గనైజ్ చేసి(వ్యవస్థీకృతం) లావాదేవీలు కొనసాగించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నిత్యానంద ఫొటోలతో ముద్రితమైనట్లుగా ఉన్న కరెన్సీ నోట్ల ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా కర్ణాటక, గుజరాత్‌లలో ఆశ్రమాలు స్థాపించి ఆధ్మాత్మిక ముసుగులో మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన నిత్యానంద దేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అనే పేరు కూడా పెట్టినట్లు తన వెబ్‌సైట్ ద్వారా వెల్లడించారు. అంతేగాక తన దేశానికి ఒక పాస్‌పోర్ట్, జెండా, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేసినట్లు పేర్కొన్నాడు. అదే విధంగా ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేసి పాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. దీంతో నిత్యానంద ఆచూకీ కోసం అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ ఫిబ్రవరిలో బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. ఇక ఇప్పుడు సొంతంగా బ్యాంకును కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment