చెన్నై: జాతీయ రవాణా సాధనమైన రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పునరుద్ఘాటించారు. భద్రత, సౌకర్యం విషయంలో ప్రయాణికుల ఆకాంక్షలను నెరవేర్చడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే రంగంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సాంకేతికత దేశీయంగా అభివృద్ధి చేసినదే కావాలన్నారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్), వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రాజెక్టులను అశ్వినీ వైష్ణవ్ ప్రస్తావించారు. తమిళనాడులోని పెరంబుదూర్‌లో శనివారం నిర్వహించిన భారతీయ రైల్వే మజ్దూర్ సంఘ్(బీఆర్‌ఎంఎస్) 20వ అఖిలభారత సదస్సులో ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
రైల్వేలను ప్రైవేటీకరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు పదేపదే ఆరోపిస్తున్నాయని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. అతిపెద్ద సంస్థ అయిన రైల్వేలను ప్రైవేట్‌కు అప్పగించే ఆలోచన, ప్రణాళిక ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై ఇప్పటికే స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. రైల్వేల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రూపకల్పనలో ఐసీఎఫ్ కృషిని మంత్రి ప్రశంసించారు. రైల్వేశాఖలో నియామకాల్లో గత యూపీఏ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం రైల్వే శాఖలో 3.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. మరో 1.40 లక్షల ఉద్యోగాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment