నోయిడా: యూపీలోని నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. సెక్టార్ 137 మెట్రో స్టేషన్ దిగువన ఒక యువకునిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో కలకలం చెలరేగింది. నిందితులను పట్టుకునేందుకు ఆరు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
మీడియాకు అందిన వివరాల ప్రకారం నోయిడా సెక్టార్ 137 మెట్రో స్టేషన్ దిగువన ఉన్న ఫుడ్ కోర్టులో ఒక యువకునిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడిని నవేంద్ర కుమార్ ఝాగా పోలీసులు గుర్తించారు.
ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశామని, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ ఘటన గురించి అదనపు సీపీ శివ హరి మీనా మాట్లాడుతూ ఆస్తి విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోందని, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరువర్గాలు మెట్రో స్టేషన్ 137 కింద సమావేశమయ్యాయన్నారు. అయితే ఇంతలోనే ఒక వర్గానికి చెందిన వారు నవేంద్ర కుమార్ ఝాపై కాల్పులు జరిపారన్నారు.
బుల్లెట్ నవేంద్ర తలకు తగిలిందని, ఆసుపత్రిలో చేర్పించాక అక్కడ మృతి చెందాడన్నారు. నవేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాల్పులు జరిపినవారిని గుర్తించామని, ఇరువర్గాలు వారు ఘజియాబాద్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. సెక్టార్ 82లోని ఆస్తి విషయంలో వీరి మధ్య వివాదం నడుస్తోందన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: విదేశీయుల్లా ఉన్నారంటూ బాలికలకు వేధింపులు
Comments
Please login to add a commentAdd a comment