ఆ భార్యాభర్తల మృతి తర్వాతే.. 55కి చేరిన తమిళనాడు కల్తీ కాటు మృతుల సంఖ్య! Number Of Deaths Increased In Kallakurichi Illicit Liquor Incident. Sakshi
Sakshi News home page

ఆ భార్యాభర్తల మృతి తర్వాతే.. 55కి చేరిన తమిళనాడు కల్తీ కాటు మృతుల సంఖ్య!

Published Sat, Jun 22 2024 8:45 AM | Last Updated on Sat, Jun 22 2024 10:14 AM

Number Of Deaths Increased In Kallakurichi Illicit Liquor Incident

చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 15 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 55కు చేరుకుంది. ప్రస్తుతం ఇంకా 100 మందికిపైనే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీళ్లలోనూ 30 మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇక, కల్తీ సారా ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీసీఐడీకి అప్పగించింది. విచారణ చేపట్టాలని ఆదేశించింది. కాగా, సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా.. ఈ కేసు విచారణను సీబీసీఐడీతో కాకుండా సీబీఐతో జరిపించాలని తమిళనాడు ప్రతిపక్ష పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

 

 

మరోవైపు.. కళ్లకురిచ్చి ఉదంతంపై శుక్రవారం అసెంబ్లీ దద్దరిల్లింది. విపక్ష ఏఐఏడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. కల్తీ మద్యం తాగి 55 మంది వరకు మృతి చెందడంపై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారంటూ స్పీకర్‌ అప్పావు వారిని మార్షల్స్‌తో బయటకు పంపించి వేశారు. ఈ ఆందోళనల్లో ఏఐఏడీఎంకేలోని మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గం సభ్యులు పాల్గొనక పోవడం గమనార్హం.

 

నిర్లక్ష్యం వల్లే ఇన్ని ప్రాణాలా?

కరుణాపురంలో కల్తీసారా తాగి తొలుత దివ్యాంగుడైన పెయింటర్‌ సురేష్‌ (35) చనిపోయాడు. ఇదే సారా తాగిన ఆయన భార్య వడివుక్కరసి గంటల వ్యవధిలోనే కన్నుమూసింది. అయితే డాక్టర్లు ఇద్దరు సహజంగా.. అనారోగ్యంతో చనిపోయారని ప్రకటించారు. రెండు రోజుల  తర్వాతే కల్తీసారా వల్లే దంపతులు చనిపోయారని వైద్యులు ప్రకటించారని సురేష్‌ సోదరుడు మీడియాకు చెబుతున్నాడు. 

ఒకవేళ.. వీళ్లిద్దరూ చనిపోయిన కారణాలను వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తే మిగిలినవారైనా బతికేవారేమోనన్న చర్చా నడుస్తోందక్కడ. అయితే కావాలనే ఆ కారణం బయటకు చెప్పకుండా వైద్యులు ఉన్నారన్న విమర్శ ఒకటి వినిపిస్తోంది. మరోవైపు.. ఈ భార్యాభర్తలవి కల్తీసారా మరణాలు కావని స్థానిక కలెక్టర్‌ చెప్పినట్లు అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. ఆయన ప్రకటన తర్వాతే.. మిగతా వాళ్లు సారా తాగి ప్రాణాలు పొగొట్టుకున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కలెక్టర్‌ను బదిలీ చేశారు. ఎస్పీని సస్పెండ్‌ చేశారు. 

కళ్లకురిచ్చిలో కల్తీసారా విక్రేతల నుంచి పోలీసులకు మామూళ్లు వెళ్తుంటాయని బాధితులు ఆరోపిస్తున్నారు. మొత్తం మృతుల్లో కళ్లకురుచ్చి ప్రభుత్వాసుపత్రిలోనే 28 మంది ప్రాణాలు వదిలారు.  చికిత్స పొందుతున్న వారిలో పలువురు కంటిచూపు కోల్పోయారు.  ఈ ప్రాంతం మారుమూల ఉండడం, సకాలంలో వైద్యం అందకపోవడంతోనే పరిస్థితికి కారణమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement