ఆ ట్రాక్‌లు సిద్ధం | Odisha Train Accident: Restoration of railway track underway | Sakshi
Sakshi News home page

ఆ ట్రాక్‌లు సిద్ధం

Published Tue, Jun 6 2023 6:30 AM | Last Updated on Tue, Jun 6 2023 6:30 AM

Odisha Train Accident: Restoration of railway track underway - Sakshi

భువనేశ్వర్‌: ఒడిశాలో మూడు రైళ్ల ఘోర రైలు ప్రమాదంతో ఛిన్నాభిన్నమైన రైల్వే ట్రాక్‌లను శరవేగంగా పునరుద్ధరిస్తున్నారు. రెండు ప్రధాన ట్రాక్‌లను ఇప్పటికే సిద్ధం చేశారు. వాటిపై తొలుత ఆదివారం రాత్రి వైజాగ్‌–రూర్కెలా గూడ్సు, అనంతరం సోమవారం ఉదయం వందేభారత్‌ ప్రయాణించాయి. మూడు రోజులుగా ఘటనా స్థలి వద్దే ఉండి పనులను పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చేతులూపి రైళ్లను స్వాగతించారు.

కోరమండల్, హౌరా ఎక్స్‌ప్రెస్‌లు, మరో గూడ్స్‌ రైలు శుక్రవారం రాత్రి ఒడిశాలోని బహనగా బజార్‌ స్టేషన్‌ సమీపంలో ఘోర ప్రమాదానికి గురైన మహా విషాదం 275 మందిని బలి తీసుకోవడం తెలిసిందే. దేశాన్ని కలచివేసిన ఈ ప్రమాదంపై రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ విచారణ ముమ్మరంగా సాగుతోంది. భువనేశ్వర్‌ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కోరమండల్‌ రైలు డ్రైవర్, అసిస్టెంట్ల స్టేట్‌మెంట్‌ను రైల్వే సేఫ్టీ కమిషనర్‌ (సీఆర్‌ఎస్‌) సోమవారం నమోదు చేశారు.

డ్రైవర్‌ కోలుకుని ఐసీయూ నుంచి వార్డుకు మారగా అసిస్టెంట్‌ తలకు సర్జరీ జరగాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో రైలు డ్రైవర్ల తప్పిదమేమీ లేదని రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించడం, మొత్తం ఉదంతంపై సీబీఐ విచారణకు సిఫార్సు చేయడం తెలిసిందే. 10మంది సభ్యులతో కూడిన బృందం సోమవారం ఘటనా స్థలిని సందర్శించింది. ఇప్పటిదాకా 170 మృతదేహాలను గుర్తించారు. ఒడిశా ప్రభుత్వం వాటిని ఉచితంగా స్వస్థలాలకు తరలిస్తోంది. ప్రమాదంలో మరణించిన, కాళ్లూ చేతులూ పోగొట్టుకున్న పశ్చిమబెంగాల్‌ వాసుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. మృతుల సంఖ్య తాజాగా 278కి పెరిగింది.

ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్సు
ఒడిశాలో సోమవారం మరో రైలు పట్టాలు తప్పింది. బారాఘర్‌ వద్ద ఓ ప్రైవేట్‌ కంపెనీకి చెందిన నారో గేజ్‌ లైన్లో లైమ్‌లైన్‌ లోడుతో వెళ్తున్న గూడ్స్‌ తాలూకు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. డుంగ్రీ లైమ్‌స్టోర్‌ గనులకు, బారాఘర్‌ ఏసీసీ సిమెంట్‌ ప్లాంట్‌కు మధ్య ఉన్న ఈ లైనుతో రైల్వేకు సంబంధం లేదు.

చార్లెస్‌ సంతాపం
ప్రమాదంపై బ్రిటన్‌ రాజు చార్లెస్‌–3 సంతాపం తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ మేరకు ఆయన సందేశం పంపారు. ఈ దారుణం తనను, రాణిని తీవ్ర షాక్‌కు గురి చేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగా ఢ సానుభూతి తెలిపారు. 1980ల్లో తన ఒడిశా పర్యటన తనకెన్నో తీపి గుర్తులు అందించింద ని గుర్తు చేసుకున్నారు. భారత్‌కు తన హృదయ ంలో ప్రత్యేక స్థానముందని చార్లెస్‌ తెలిపారు.

మోదీకి ఖర్గే లేఖాస్త్రం
రైల్వేలను ప్రాథమిక స్థాయి నుంచి బలోపేతం చేయకుండా కేవలం పైపై మెరుగులు దిద్దుతూ వార్తల్లో నిలవడంపైనే ప్రధాని మోదీ దృష్టి పెట్టారంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రమాదానికి అసలు కారణాలను బయట పెట్టాలంటూ మోదీకి లేఖ రాశారు. ‘‘నేరాలను దర్యాప్తు చేసే సీబీఐ రైలు ప్రమాదం విషయంలో ఏం చేస్తుంది? సాంకేతిక, వ్యవస్థాగత, రాజకీయ వైఫల్యాలను సీబీఐ నిగ్గుదేల్చగలదా?’’ అని ప్రశ్నించారు.
ప్రమాద మార్గంలో ట్రాక్‌ పునరుద్ధరణ తర్వాత వెళ్తున్న రైళ్లు . శిథిలాలు కన్పించకుండా కట్టిన తెరలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement