ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి 6 రోజులు గడిచింది. బాధితులు ఇంకా తమవారి మృతదేహాల కోసం వెదుకులాట సాగిస్తూనే ఉన్నారు. ఇంకా 100 మృతదేహాలకు శవ పంచనామా పూర్తికాలేదు. దీంతో బాధితులు భువనేశ్వర్ ఎయిమ్స్ వద్ద పడరాని పాట్లు పడుతున్నారు. పలు మృతదేహాలను గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తుతుండటంతో అధికారులు వాటికి డీఎన్‌ఏ పరీక్షలు చేయించాల్సివస్తోంది. ఇందుకోసం డీఎన్‌ఏ శాంపిల్స్‌ను భువనేశ్వర్ ఎయిమ్స్ వద్ద సేకరిస్తున్నారు. ఎయిమ్స్‌తోపాటు మరో ఐదు కేంద్రాలలోనూ డీఎన్‌ఏ శాంపిల్స్ సేకరణ జరుగుతోంది.
మీడియాతో ఒక బాధితుడు మాట్లాడుతూ తన కుమారుని మృతదేహాన్ని గుర్తుపట్టినప్పటికీ తమకు దానిని అప్పటించడం లేదని ఆరోపించారు. డీఎన్‌ఏ రిపోర్టు వచ్చాకనే ఇస్తామంటున్నారని తెలిపారు. తన దగ్గర ప్రస్తుతం తిండికి కూడా ఖర్చులు లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు చాలామంది బాధితులు తమ వారి డీఎన్‌ఏ రిపోర్టులు వచ్చాకనే మృతదేహాలను తీసుకు వెళుతున్నారు. మరికొందరైతే ఇక్కడి పరిస్థితులను చూసి, తమవారి మృతదేహాలు దొరుకుతాయనే ఆశను కూడా వదులుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఒక బాధితుడు ఇప్పటివరకూ తన సోదరుని మృతదేహం లభ్యం కాలేదని, ఇక ఆశ వదులుకొని తిరిగి ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటున్నానన్నాడు. ఇక్కడ వెదుకులాట సాగిస్తూ మూడు రోజులయ్యింది. అధికారులు డీఎన్‌ఏ ఇచ్చి వెళ్లిపొమ్మంటున్నారని తెలిపాడు. కాగా ఇప్పటి వరకూ 30 డీఎన్‌ఏ శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్‌ను ప్రభుత్వం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు పంపించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మృతదేహాలను కోల్డ్ రూమ్‌లలో ఉంచారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ప్రమాదంలో మొత్తం 288 మంది మృతి చెందారు. 193 మృతదేహాలను, భువనేశ్వర్ తరలించారు. 94 మృతదేహాలను బాలాసోర్‌లో ఉంచారు. ఒక బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. భువనేశ్వర్ తరలించిన 193 మృతదేహాలలో 110 మృతదేహాలకు శవ పంచనామా పూర్తయ్యింది. ఇంకా 83 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. 200 మంది బాధితులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనలో దాదాపు 1000 మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment