జమ్మూ కశ్మీర్: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లతో భారత్ జరిపిన చర్చలను జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఓమర్ అబ్దుల్లా తప్పుపట్టారు. ఆయన బుధవారం మీడియాతో మట్లాడుతూ.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు. తాలిబన్లను ఉగ్రవాద సంస్థగా కేంద్రం పరిగణిస్తుందా? లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్రం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తాలిబన్ ఉగ్రవాద సంస్థ అయితే మంగళవారం వాళ్లతో ఎందుకు చర్చలు జరిపారని మండిపడ్డారు. తాలిబన్లు ఉగ్రవాదులు కాకపోతే.. ఐక్యరాజ్య సమితికి వెళ్లి ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించాలని చెప్పగలరా? అని నిలదీశారు.
చదవండి: Afghanistan Cinema: అఫ్గన్ థియేటర్ల మూత, బాలీవుడ్‌కు ఆర్థిక ముప్పు
ఈ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని ఓమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. కేంద్రం తాలిబన్లను ఉగ్రవాదులుగా పరిణిస్తున్న క్రమంలో ఎందుకు చర్చలు జరిపారో సమాధానం చెప్పాలన్నారు. మంగళవారం తాలిబన్ నేత షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్‌తో ఖతార్‌లో భారత్ రాయబారి దీపక్ సమావేశమైన విషయం తెలిసిందే. అఫ్గాన్ గడ్డపై భారత వ్యతిరేకశక్తులను అడ్డుకోవడం, భారతీయుల స్వదేశానికి రాక తదితర అంశాలు చర్చకొచ్చాయి. తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తాలిబన్లు హామీ ఇచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment