వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలి | Parliamentary panel seeks boost for agri exports | Sakshi
Sakshi News home page

వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలి

Published Thu, Aug 27 2020 5:06 AM | Last Updated on Thu, Aug 27 2020 7:51 AM

Parliamentary panel seeks boost for agri exports - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులతో పోలిస్తే ఎగుమతులు నామమాత్రంగానే ఉన్నాయని, దేశం నుంచి ఎగుమతి అయ్యే మొత్తం సరుకులలో వ్యవసాయ ఉత్పత్తుల వాటా సగటున 1 శాతం కూడా ఉండటం లేదని వాణిజ్యానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక పేర్కొంది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాల్సిన తక్షణ అవసరం ఉన్నట్లు కమిటీ అభిప్రాయపడింది. అందుకోసం తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ స్థాయీ సంఘం 154వ నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

వ్యవసాయ, మత్స్య, ప్లాంటేషన్, కొబ్బరిపీచు, పసుపు ఉత్పాదనల ఎగుమతులపై స్థాయీ సంఘం జరిపిన అధ్యయనం, సిఫార్సులకు సంబంధించిన 154వ నివేదికను స్థాయీ సంఘం చైర్మన్‌ వి.విజయసాయి రెడ్డి బుధవారం ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడుకు సమర్పించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, మత్స్య ఉత్పాదనల ఎగుమతుల ప్రోత్సాహానికి నివేదికలో స్థాయీ సంఘం ప్రభుత్వానికి చేసిన కొన్ని ప్రధానమైన సిఫార్సులను వివరించారు.

‘వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు వాణిజ్య  శాఖ తక్షణమే నడుం బిగించాలి. వ్యవసాయోత్పత్తుల సప్లై చైన్‌ సామర్థ్యాన్ని పటిష్టం చేయాలి. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలి. వ్యవసాయోత్పత్తులకు అత్యధిక విలువ చేకూరేలా చర్యలు తీసుకోవాలి..’అని కమిటీ సిఫార్సు చేసినట్లు చైర్మన్‌ తెలిపారు. శాస్త్రీయ పద్దతుల ద్వారా రైతులు నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదనలు సాధించేందుకు ప్రభుత్వం వారికి తగిన మద్ధతు, ప్రోత్సాహకాలను అందించడం ద్వారా వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను గణనీయంగా వృద్ధి చేయవచ్చునని కమిటీ సిఫార్సు చేసింది. ఈజిప్టు, మెక్సికో, మలేíసియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలకు బియ్యం ఎగుమతుల కోసం మార్కెట్లను అన్వేషించాలని కోరింది.

మత్స్య ఉత్పాదనల ఎగుమతులపై దృష్టి సారించాలి...
2010–11 నుంచి 2014–15 వరకు మత్స్య ఉత్పాదనల ఎగుమతులలో కనిపించిన వృద్ధి 2015–16 నుంచి క్షీణించడం మొదలైంది. ఈ పరిస్థితిని అధిగమించి తిరిగి మత్స్య ఉత్పాదనల ఎగుమతులలో వృద్ధి సాధించడానికి కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ‘చేపలు, రొయ్యల సాగులో మితిమీరిన యాంటీబయాటిక్స్‌ వినియోగాన్ని ఆరికట్టేందుకు శాఖాపరమైన నియంత్రణ, అజమాయిషీ ఉండేలా చర్యలు తీసుకోవాలి.

రైతులు యాంటీబయాటిక్స్‌ను నియంత్రిత రీతిలో వినియోగించేందుకు అవసరమైన ఎక్స్‌టెన్షన్‌ సేవలను ప్రభుత్వ పర్యవేక్షణలో అందుబాటులోకి తీసుకురావాలి..’అని కమిటీ సిఫార్సు చేసింది. ‘మత్స్య ఉత్పాదనల నాణ్యత, దిగుబడులే లక్ష్యంగా పరిశోధన, అభివృద్ధి చేపట్టాలి. ట్యూనా చేపలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ దృష్ట్యా మత్స్య ఉత్పాదనల ఎగుమతులలో ట్యూనా చేపల వాటా పెంచడానికి చర్యలు తీసుకోవాలి’అని వాణిజ్య  శాఖకు కమిటీ సిఫార్సు చేసింది. ఈ విషయంలో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీతో సంప్రదించి పథకాన్ని రూపొందించాలని కమిటీ సూచించింది.

పొగాకు సాగులో ఎఫ్‌డీఐని అనుమతించాలి
దేశంలో ఏటా 800 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పొగాకు సాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. పొగాకు ఉత్పాదనల ద్వారా ఏటా (2018–19 గణాంకాల ప్రకారం) సుమారు రూ. 6 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడం జరుగుతోంది. కానీ పొగాకు సాగుకు మాత్రం తగినంత ప్రోత్సాహం అందడం లేదని కమిటీ అభిప్రాయపడింది. పొగాకు పరిశోధనకు అరకొర నిధుల కేటాయింపు కారణంగా ప్రపంచ మార్కెట్లలో దేశీయ పొగాకు ఉత్పాదనలు పోటీకి నిలవలేకపోతున్నాయి.

ప్రపంచ ప్రమాణాలకు దీటుగా పొగాకు పండించడానికి పర్యావరణ ప్రతికూలతలను తట్టుకోగల అత్యత్తుమ నాణ్యత, అధిక దిగుబడి సాధించగల వెరైటీలను సాగు చేయడానికి పొగాకు పరిశోధన ఎంతగానో తోడ్పడుతుందని కమిటీ నివేదికలో పేర్కొంది. అందుకు పొగాకు పరిశోధనకు అవసరమైన నిధుల కేటాయింపు జరగాలి. 2017లో ప్రకటించిన ఎఫ్‌డీఏ విధానం ద్వారా కాఫీ, టీ, రబ్బర్, యాలకులు వంటి ప్లాంటేషన్‌ పంటల సాగులో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించారు. కానీ పొగాకు పంటకు ఆ వెసులుబాటు లేదు. కాబట్టి పొగాకు సాగులో కూడా ఎఫ్‌డీఐకి అనుమతించాలని కమిటీ సిఫార్సు చేసింది.

అయితే ఎఫ్‌డీఐ ద్వారా సాగు చేసే పొగాకును ఆక్షన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా మాత్రమే మార్కెట్‌ చేయాలన్న నిబంధన ఉండాలని సిఫార్సుల్లో పేర్కొంది. సిగరెట్ల అమ్మకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ 1 శాతం సుంకం విధించి ఆ మొత్తాన్ని పొగాకు మార్కెట్‌ స్థిరీకరణ కోసం వినియోగించాలన్న టుబాకో బోర్డు సూచనను కమిటీ ప్రశంసిస్తూ ఈ దిశగా చర్యలు తీసుకోవలసిందిగా వాణిజ్య మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. దీని వల్ల మార్కెట్‌ సంక్షోభ పరిస్థితులలో రైతుల ఉత్పత్తులకు న్యాయమైన ధర లభిస్తుందని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement