సాక్షి, మైసూరు : ఆమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘3 ఇడియట్స్’ లోని డెలివరీ సీన్ గుర్తుందా... స్కైప్ ద్వారా డాక్టర్ సలహా తీసుకొని సుఖ ప్రసవం చేసిన రీల్ సీన్ లాంటి సీన్ రియల్‌గా రిపీట్ అయింది. ఫోన్ ద్వారా డాక్టర్ సలహాలను తీసుకొని మరీ ఒక మహిళకు డెలివరీ చేసిన ఉదంతం పలువురి అభిమానాన్ని దక్కించుకుంది. ఈ ఘటన మార్చి 9న కర్ణాటకలోని మినీ విధాన సౌధ ఎదురుగా ఉన్న ఒక పబ్లిక్ పార్కులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే కొడగులోని గోనికోప్పల్ సమీపంలోని ఒక గిరిజన గ్రామానికి చెందిన మల్లిగే (35) తొమ్మిది నెలల గర్భవతి. తన పిల్లలు బాలుడు(8), బాలికి(6) పిల్లలతో నగరానికి వచ్చింది. ఇంతలో ఆమెకు పురిటినొప్పులు మొదలైనాయి. దీంతో సమీపంలోని పార్క్‌కు వెళ్లిన ఆమె నొప్పులు భరించలేక బిగ్గరగా ఏడుస్తూ.. సహాయం కోసం అరవడం మొదలు పెట్టింది. దీంతో బెంబేలెత్తిన పిల్లల కూడ ఏడుపందుకున్నారు. దీంతో చుట్టుపక్కల షాపుల వారంతా అక్కడిచేరుకుని విషయాన్ని గమనించారు. షాప్ కీపర్లు చాలా మంది మగవారు కావడంతో ఎవరైనా ఆడవాళ్లు సమీపంలోనై ఎవరైనా ఉన్నారని వెదికారు. కానీ ఫలితం లేదు. ఇంతలో ఒకరు 108కి సమాచారం అందించారు. ఈ క్రమంలో అదే రోడ్డులో వెళుతున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) శోభా ప్రకాష్ పార్క్ లోపల ఉన్న జనాన్ని చూసి బండి ఆపి విషయం ఆరా తీశారు. ఆమె కూడా ఖంగారుపడుతూ 108 కి ఫోన్ చేసింది.
ఇక్కడే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనంలో ఉన్న ఒకాయన తన స్నేహితుడైన డాక్టర్‌కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన ఆ డాక్టర్ అక్కడ ఎవరైనా ఆడవాళ్లున్నారా అని వాకబు చేశారు. దీంతో ఆయన వెంటనే ఫోన్‌ను శోభాకు కిచ్చారు. తాను ఫోన్ ద్వారా కొన్ని సూచనలు ఇస్తాననీ, వాటిని జాగ్రత్తగా పాటిస్తే..తల్లీ బిడ్డ క్షేమంగా బైటపడతారని చెప్పారు. దీనికి శోభ అనుమాన పడుతూనే ఒప్పుకున్నారు. అలా డాక్టర్ సలహా మేరకు శోభా మల్లిగేకు సహాయం చేయడంతో నిమిషాల్లో, మల్లిగే ఆడ బిడ్డను ప్రసవించింది. శిశువు ప్రసవించిన తర్వాత, బొడ్డు తాడు ఎలా కట్ చేయాలో బోధపడలేదు శోభకు. అలా అనుమానిస్తుండగానే ఒక వ్యక్తి కొత్త బ్లేడును తీసుకొచ్చాడు. ఏం పరవాలేదు కట్ చేయమని డాక్టర్ ధైర్యం చెప్పారు. కానీ అప్పటికే అంబులెన్స్ అక్కడికి చేరుకోవడం, సర్జికల్ బ్లేడుతో బొడ్డుతాడు కోయడం, తల్లీ బిడ్డల్ని ఆసుపత్రికి తరలించడంతో కథ సుఖాంతమైంది. మల్లిగే వద్ద ఉన్న ‘థాయ్’ కార్డులో ఉన్న వివరాల ఆధారంగా ఆమె కుటుంబానికి సమాచారం అందించారు. దీంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
తనకు ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఇదే తొలిసారి అని శోభ వ్యాఖ్యానించారు. కానీ రెండు ప్రాణాలను కాపాడినందుకు చాలా సంతోషంగానూ, ఆశ్చర్యంగానూ ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ సందర్భంగా చొరవ తీసుకున్న డాక్టర్‌కి కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment