
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సోమవారం రాజ్యసభలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాజ్యసభ ప్రతిపక్షనేత (కాంగ్రెస్) గులాంనబీ అజాద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. విపక్షంలో ఉన్నప్పటికీ ఆయన ఎంతో హుందాగా మాట్లాడుతారని, ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నట్లు మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా సభలో కొత్తగా అడుగుపెట్టేవారు అజాద్ నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. అంతేకాకుండా ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జరిగిన స్థానిక ఎన్నికలను సైతం మోదీ ప్రస్తావించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడంలో గులాంనబీ అజాద్ ఎంతో చొరవ చూపారని ప్రశంసించారు. మోదీ ప్రసంగంతో అధికార పక్షంతో పాటు విపక్ష సభ్యులు సైతం అశ్చర్యానికి గురయ్యారు. సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మోదీ ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీపై తిరుగుబాటు లేఖ సందించిన సీనియర్లలో గులాంనబీ అజాద్ ముందువరుసలో ఉన్న విషయం తెలిసిందే. పార్టీలో సమూల మార్పులు జరగాలని గత ఏడాది ఆగస్టులో లేఖ రాసి, అసమ్మతిని బహిర్గతం చేసిన జీ–23లోని కీలక నేతల్లో ఆయన కూడా ముఖ్య పాత్ర పోషించారు. అంతేకాకుండా పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరగకపోతే మరో 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోకతప్పదని అధిష్టానికి హెచ్చరికాలు సైతం జారీచేశారు. పలుమార్లు పార్టీ నాయకత్వంలో అసమ్మతి గళం వినిపించారు. ఈ క్రమంలోనే పార్లమెంట్‌లో ప్రధాని మోదీ అజాద్‌పై ప్రశంసలు కురిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.