సాక్షి, న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం పేరుతో ఏటా తీర్మానాలు చేసే వారు ఈసారి దేశం కోసం తీర్మానం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రెండో విడత మన్ కీ బాత్ 19వ సంచికలో ఆదివారం ప్రధాని దేశవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం తీర్మానం చేయాలన్న విశాఖపట్నానికి చెందిన వెంకట మురళీ ప్రసాద్, కొల్హాపూర్‌కు చెందిన అంజలి చేసిన ఈ సూచనను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశం 2021లో కొత్త విజయ శిఖరాలు తాకాలని, ప్రపంచంలో భారతదేశం మరింత గుర్తింపు పొందాలని, మరింత శక్తిమంతం కావాలని కోరుకోవడం కంటే గొప్ప కోరిక ఏముంటుందని ప్రధాని పేర్కొన్నారు.
కరోనా కారణంగా సప్లయ్ చైన్‌తో పాటు అనేక విషయాల్లో ప్రపంచంలో చాలా అడ్డంకులు ఏర్పడ్డాయని, కానీ, ప్రతి సంక్షోభం నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్నామన్నారు. దేశంలో కొత్త సామర్థ్యం కూడా ఏర్పడిందని, దీనికి స్వావలంబన అని పేరు పెట్టొచ్చని మోదీ తెలిపారు. గుర్‌గావ్‌కు చెందిన ప్రదీప్ హీలింగ్ హిమాలయాస్ అనే ఉద్యమం ప్రారంభించి, పర్యాటక ప్రాంతాల్లో టన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ను శుభ్రపరిచారని తెలిపారు. ఇదే స్ఫూర్తిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి దేశానికి విముక్తి కల్పించాలని కోరారు. 2021 తీర్మానాల్లో ఇది కూడా ఒకటిగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఆసక్తికరమైన లేఖ అది
‘విశాఖపట్నం నుంచి వెంకట మురళీ ప్రసాద్ రాసిన ఆలోచన విభిన్నంగా ఉంది. 2021 కోసం ఏబీసీని అటాచ్ చేస్తున్నానంటూ లేఖ రాశారు. స్వయం సమృద్ధిగల భారత చార్ట్ ఏబీసీ. చాలా ఆసక్తికరంగా ఉంది. నిత్యం వినియోగించే అన్ని వస్తువుల పూర్తి జాబితాను వెంకట్ తయారుచేశారు. దీంట్లో ఎలక్ట్రానిక్, స్టేషనరీ, స్వీయ సంరక్షణ సామగ్రితోపాటు మరికొన్ని వస్తువులు ఉన్నాయి. మనకు తెలియకుండానే దేశంలో సులభంగా లభించే విదేశీ ఉత్పత్తులు ఉపయోగిస్తున్నామని తెలిపారు. దేశవాసుల శ్రమ, చెమట ఉన్న ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తానని వెంకట్ ప్రతిజ్ఞ చేశారు. స్వావలంబన దేశానికి తాము మద్దతు ఇస్తున్నామని కూడా రాశారు. దేశీయ తయారీదారులు నాణ్యతలో రాజీ పడరాదు’’
Comments
Please login to add a commentAdd a comment