సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర భూమి పూజ వేడుకకు అందరూ సన్నద్ధమయ్యారు. బుధవారం నాడు జరగనున్న భూమి పూజ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు మరికొంత మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని బుధవారం నాడు ఢిల్లీ నుంచి బయలుదేరి రెండు గంటల పాటు అయోధ్య భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. బుధవారం నాడు మోదీ ప్రత్యేక జెట్‌లో ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరతారు. 10.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో మోదీ అయోధ్యకు బయలు దేరతారు. 11.30లకు ఆయన అయోధ్య చేరుకుంటారు. 11:40 గంటలకు హనుమాన్‌గడి ఆలయంలో పూజలు చేయనున్నారు. 10వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ఆయన ఏడు నిమిషాల పాటు గడుపుతారని, ఆ సమయంలోనే ప్రధాని ఆరోగ్యం బాగుండాలని, దేశంలో కరోనా వ్యాప్తి తగ్గాలని వేద మంత్రాలు చదువుతామని హనుమాన్ గడి ప్రధాన పురోహితుడు మహంతి రాజు దాస్ మీడియాకు తెలిపారు.
మధ్యాహ్నం 12 గంటలకు రామజన్మభూమి ప్రాంతానికి ప్రధాని చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:30 నుంచి 12:40 వరకు భూమి పూజ జరుగుతుంది. మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. 2:15 గంటలకు తిరిగి ఢిల్లీకి ప్రధాని పయనమవుతారు. భూమి పూజకు ఆహ్వానించిన వారే అయోధ్యకు రావాలని ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ విజ్ఞప్తి చేశారు. నిఘావర్గాల హెచ్చరికల నేపధ్యంలో అయోధ్య భూమిపూజ జరిగే వేదికపై ప్రధానితో పాటు మరో నలుగురికి మాత్రమే చోటు కల్పించనున్నారు. మొత్తం 175 మంది అతిధులకు మాత్రమే ఆహ్వానం అందించారు. యూపీ సీఎం, డిప్యూటీ సీఎం మినహా ఇతర మంత్రులకు ఆహ్వానం అందలేదు. భూమిపూజ కార్యక్రమానికి దేశంలోని 2 వేల ప్రాంతాల నుండి పవిత్రమైన మట్టి, 100 నదుల నుండి నీరు వినియోగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment