భారీ మార్పులతో జంబో కేబినెట్‌ | PM Narendra modi cabinet reshuffle | Sakshi
Sakshi News home page

భారీ మార్పులతో జంబో కేబినెట్‌

Published Thu, Jul 8 2021 4:23 AM | Last Updated on Thu, Jul 8 2021 6:46 AM

PM Narendra modi cabinet reshuffle - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన టీమ్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. అనూహ్య మార్పులు, భారీ చేర్పులతో జంబో కేబినెట్‌ను తీర్చిదిద్దారు. కఠిన నిర్ణయాలతో సీనియర్‌ మంత్రులకు సైతం షాకిచ్చారు. వివిధ కారణాలతో ఏకంగా 12 మందికి ఉద్వాసన పలికారు. పలువురు జూనియర్లకు సీనియర్లుగా ప్రమోషన్‌ ఇచ్చి కేబినెట్‌ హోదా కల్పించారు.

యూపీ సహా పలు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికలు, సామాజిక సమీకరణాలు, పనితీరు, సంస్థాగత అవసరాలు ప్రాతిపదికగా భారీ కసరత్తు అనంతరం మొత్తం 77 మంది మంత్రులతో సరికొత్త మంత్రి మండలిని కొలువుదీర్చారు. ప్రధానితో కలిపి మంత్రుల సంఖ్య 78 కి చేరగా, గరిష్టంగా 81 మంది వరకు మంత్రులుగా ఉండవచ్చు. పదవి కోల్పోయిన మంత్రుల్లో సీనియర్లైన ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా ఉన్నారు. మొత్తం 15 మంది కేబినెట్‌ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.

తాజా మంత్రివర్గంలో మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణే, అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన మధ్యప్రదేశ్‌ నేత జ్యోతిరాదిత్య సింధియాలకు చోటు కల్పించారు. కరోనా రెండో వేవ్‌ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలకు ఆస్కారమిచ్చిన వైద్య, విద్యా శాఖల మంత్రులు డాక్టర్‌ హర్షవర్థ్దన్, రమేష్‌ నిశాంక్‌ పోఖ్రియాల్‌ సహా మొత్తం 12 మందిని మంత్రివర్గం నుంచి తప్పించారు. వీరి రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందే ఆమోదించారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోలేదన్న విమర్శలతో ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వసనీయత తగ్గుతోందన్న సంకేతాల నేపధ్యం ఈ భారీ ఉద్వాసనకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా, దేశంలో కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ చేసిన పలు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

43 మంది ప్రమాణ స్వీకారం
బుధవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన  కార్యక్రమంలో ఏడుగురు మహిళలు సహా మొత్తం 43 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 36 మంది కొత్త వారు కాగా.. ఇప్పటికే స్వతంత్ర, సహాయ మంత్రులుగా ఉన్న ఏడుగురు కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జి.కిషన్‌రెడ్డికి కేబినెట్‌ ర్యాంక్‌తో పదోన్నతి లభించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీలో కేబినెట్‌ మంత్రిగా పనిచేసిన నేతల్లో ఎం.వెంకయ్యనాయుడు తరువాత కిషన్‌రెడ్డి రెండో తెలుగు వ్యక్తి కావడం విశేషం. కాగా కొత్తగా ప్రమాణం చేసిన వారిలో 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కొత్తగా పలువురు మహిళల చేరికతో మంత్రివర్గంలో మహిళల సంఖ్య 11కి చేరింది. తమిళనాడుకు చెందిన ఎల్‌ మురుగన్‌ ఏ సభలోనూ సభ్యుడిగా లేరు. ఆయనను పుదుచ్చేరి నుంచి రాజ్యసభకు పంపించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి నిష్క్రమిస్తున్న రవిశంకర్‌ ప్రసాద్, హర్షవర్ధన్, జావదేకర్‌ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరుకావడం విశేషం.

భాగస్వామ్య పక్షాలకు పదవులు
అలాగే భాగస్వామ్య పక్షాలను కేబినెట్‌లో భాగం చేయడం ద్వారా ప్రాంతీయంగా, సామాజికంగా వివిధ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న జేడీయూ, లోక్‌జనశక్తి పార్టీ, అప్నాదళ్‌ పార్టీలకు మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించారు. జేడీయూ జాతీయ అధ్యక్షుడు రామచంద్రప్రసాద్‌ సింగ్, లోక్‌జనశక్తి లోక్‌సభాపక్ష నేత పశుపతి కుమార్‌ పారస్, అప్నాదళ్‌ అధ్యక్షురాలు అనుప్రియా సింగ్‌ పటేల్‌కు స్వతంత్ర హోదాతో సహాయ మంత్రి పదవి దక్కింది.  

యూపీకి పెద్దపీట
వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట దక్కింది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సహాయ మంత్రుల్లో అత్యధికంగా యూపీ నుంచి ఏడుగురికి ప్రాతినిథ్యం లభించింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న బి.ఎల్‌.వర్మ, పం కజ్‌ చౌదరి, డాక్టర్‌ సత్యపాల్‌ సింగ్‌ భగేల్, భానూప్రతాప్‌ సింగ్‌ వర్మ, కౌశల్‌ కిశోర్, బి.ఎల్‌.వర్మ, అజయ్‌ కుమార్‌ మిశ్రాలతో పాటు అప్నాదళ్‌ అధ్యక్షురాలు అనుప్రియా సింగ్‌ పటేల్‌కు యూపీ నుంచి ప్రాతినిధ్యం దక్కింది.

యూపీలో సోషల్‌ ఇంజనీరింగ్‌
యూపీ కోటాలో ఓబీసీ, బ్రాహ్మణ,  దళిత సామాజిక వర్గాలకు ప్రాధాన్యత లభించింది. వారణాసికి పొరుగున ఉన్న మీర్జాపూర్‌ నుంచి అనుప్రియా పటేల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్నా దళ్‌ (ఎస్‌) అధ్యక్షురాలిగా ఉన్న అనుప్రియా పటేల్‌ కుర్మి సామాజిక వర్గ ప్రతినిధిగా ఉన్నారు. తూర్పు యూపీ, బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని కుర్మి ఓట్లపై ఆమె ప్రభావం చూపుతారు. బి.ఎల్‌.వర్మ లోధి ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతారని బీజేపీ విశ్వసిస్తోంది. కౌషల్‌ కిషోర్‌ యూపీ బీజేపీ షెడ్యూలు కులాల ఫ్రంట్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. భానూ ప్రతాప్‌ సింగ్‌ వర్మ కూడా షెడ్యూలు కులాల ఓట్లపై ప్రభావం చూపగలరని బీజేపీ భావిస్తోంది. అజయ్‌ మిశ్రా బ్రాహ్మణ వర్గ ప్రతినిధిగా ఉన్నారు.  
 

పదోన్నతి వీరికే..
స్వతంత్ర హోదాలో క్రీడల శాఖ మంత్రిగా ఉన్న కిరెణ్‌ రిజిజు, విద్యుత్తు శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే సింగ్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిగా ఉన్న హర్దీప్‌సింగ్‌ పూరి, షిప్పింగ్‌ శాఖ మంత్రిగా ఉన్న మన్‌సుఖ్‌ ఎల్‌.మాండవీయలకు కేబినెట్‌ ర్యాంకు లభించింది. హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న గంగాపురం కిషన్‌రెడ్డికి, ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌కు, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా ఉన్న పర్షోత్తమ్‌ రుపాలాకు కేబినెట్‌ హోదా దక్కింది.

క్రియాశీల నేతలకు పదవులు
బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు భూపేందర్‌ యాదవ్‌ కేబినెట్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌కు సహాయ మంత్రి పదవి లభించింది. యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న బి.ఎల్‌.వర్మనూ మంత్రిపదవి వరించింది.  

గుజరాత్‌కు పెరిగిన ప్రాతినిథ్యం..
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో గుజరాత్‌ నుంచి ఇద్దరికి కేబినెట్‌ పదవులు, ముగ్గురికి సహాయ మంత్రి పదవులు దక్కడం విశేషం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ స్వరాష్ట్రం గుజరాతే. హోం శాఖ మంత్రి అమిత్‌ షా కూడా గుజరాత్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా కేబినెట్‌ ర్యాంకులు దక్కిన మన్‌సుఖ్‌ మాండవీయ ఇప్పటికే స్వతంత్ర మంత్రిగా, పర్షోత్తం రుపాలా సహాయ మంత్రిగా ఉన్నారు. బిహార్‌కు చెందిన ముగ్గురికి, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరికీ కేబినెట్‌ ర్యాంకులు దక్కడం విశేషం. ఇక కర్ణాటకకు నాలుగు పదవులు దక్కాయి.

పనితీరు కోణంలో..
కోవిడ్‌ నేపథ్యంలో కొందరు మంత్రుల పనితీరు సవ్యంగా లేకపోవడం, విమర్శలకు ఆస్కారం ఇవ్వడం వంటి కారణాల నేపథ్యంలో పాలనను మరింత పటిష్టం చేసేందుకు ప్రధాని పూర్తిస్థాయిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు భారీ కసరత్తు చేశారు. నెల రోజులుగా పలు దఫాలుగా పార్టీ, ప్రభుత్వ వర్గాల నుంచి స్పందన సేకరించి మంత్రివర్గానికి కొత్త రూపు తెచ్చారు. పనితీరు మెరుగ్గా ఉండేందుకు యువతకు పెద్దపీట వేశారు. సివిల్‌ సర్వీసెస్‌ మాజీ అధికారులు, వృత్తి నిపుణులను కేబినెట్‌లో భాగం చేశారు.  

రాజకీయ కోణంలో..
సామాజిక సమీకరణాలపై పకడ్బందీగా కసరత్తు చేసినట్టు అవగతమవుతోంది. మొత్తం మంత్రిమండలిలో ఓబీసీ వర్గాలకు చెందిన వారు 27 మంది, ఎస్సీ వర్గానికి చెందిన 12 మంది, ఎస్టీ వర్గానికి చెందిన 8 మంది, మైనార్టీలు ఐదుగురు, 11 మంది మహిళలు ఉన్నారు. కేబినెట్‌ ర్యాంకుతో ఐదుగురు ఓబీసీ మంత్రులు ఉన్నారు. ఎస్సీల్లో చమర్, ఖాతిక్, పాసీ, కోరి, మాదిగ, మహర్, అరుంధతియార్, మేఘ్వాల్, రాజ్‌బొన్షి, మథువా–నామశూద్ర, దంగర్‌ తదితర ఉపకులాలకు సమాన ప్రాతినిథ్యం కల్పించారు. ఇక ఎస్టీల్లో గోండులు, సంతాల్, మిజి, తదితర వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. మంత్రులుగా అవకాశం దక్కినవారిలో ఎక్కువ మంది తొలిసారి ఎన్నికైన వాళ్లే ఉన్నారు. అలాగే వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు కొత్తగా ఏడు మంత్రి పదవులు ఇచ్చి పెద్ద పీట వేశారు.  

హోంశాఖ సహాయ మంత్రిగా పిన్నవయస్కుడు నిశిత్‌
హోంశాఖ సహాయ మంత్రిగా నిశిత్‌ ప్రామానిక్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. తాజా మంత్రి వర్గ విస్తరణలో పిన్న వయస్కుడైన నిశిత్‌కు యువజన, క్రీడల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బాధ్యతలు కూడా అప్పగించారు. గత కేబినెట్‌లో సహాయ మంత్రులుగా ఉన్న అనురాగ్‌ ఠాకూర్‌కు సమాచార ప్రసార శాఖతోపాటు క్రీడలు యువజన వ్యవహారాలు అప్పగించగా  మాన్సుఖ్‌లాల్‌ మాండవీయకు ఆరోగ్యశాఖ అప్పగించారు. తాజా విస్తరణలో చొటు దక్కించుకున్న అశ్విని వైష్ణవ్‌కు కీలక రైల్వే శాఖతోపాటు ఐటీ, కమ్యూనికేషన్ల శాఖలు అప్పగించారు.  శంతను ఠాకూర్‌కు ఓడరేవులు, జలరవాణా సహాయమంత్రిగా మహిళల్లో అనుప్రియ పటేల్‌కు వాణిజ్య, పరిశ్రమల శాఖసహాయ మంత్రిగా, భారతిప్రవీణ్‌ పవార్‌కు ఆరోగ్యశాఖసహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు.  
ప్రమాణ స్వీకారం తర్వాత కేబినెట్‌ మంత్రులతో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ తదితరులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement