PM Narendra Modi's Mother Heeraben Modi Passed Away - Sakshi
Sakshi News home page

మోదీకి మాతృవియోగం

Published Fri, Dec 30 2022 6:40 AM | Last Updated on Sat, Dec 31 2022 4:35 AM

PM Narendra Modi mother Heeraben dies at 100 - Sakshi

అహ్మదాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ కన్నుమూశారు. వందేళ్లు సంపూర్ణ జీవితం గడిపిన ఆమె అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3.30 గంటలకు తుది శ్వాస విడిచారు. రెండు రోజుల క్రితమే అనారోగ్యంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. హీరాబెన్‌కు ప్రధాని మోదీ సహా అయిదుగురు కుమారులు సోమాబాయ్, అమృత్, ప్రహ్లాద్, పంకజ్, కుమార్తె  వాసంతిబెన్‌ ఉన్నారు. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే ప్రధాని మోదీ వెంటనే గాంధీనగర్‌కు బయల్దేరి వెళ్లారు.

గాంధీనగర్‌ శివార్లలో రేసన్‌ గ్రామంలో నివాసం ఉంటున్న తన సోదరుడు పంకజ్‌ మోదీ నివాసంలో ఉంచిన తల్లి భౌతిక కాయాన్ని సందర్శించిన మోదీ ఆమెకు పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. పాదాభివందనం చేశారు. అనంతరం ప్రధాని స్వయంగా ఆమె పాడె మోస్తూ  వైకుంఠ రథం వరకు తీసుకువెళ్లారు. తల్లి భౌతికకాయంతో పాటు అదే వాహనంలో మోదీ బాధాతప్త హృదయుడై ప్రయాణించారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో గాంధీనగర్‌ శ్మశాన వాటికలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అంత్యక్రియలు ముగిశాయి. ప్రధాని మోదీ గుజరాత్‌ పర్యటనకు వెళ్లినప్పుడల్లా తల్లితో కాసేపు గడిపేవారు. తన పుట్టిన రోజు నాడు వెళ్లి తల్లి ఆశీర్వాదం తీసుకునేవారు. దేశ ప్రధానమంత్రికే తల్లి అయినప్పటికీ హీరాబెన్‌ ఎంతో నిరాడంబరమైన జీవితం గడిపారు.  

అత్యంత విషాదం  
ప్రధాని తల్లి హీరాబెన్‌ మరణవార్త విన్న ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా మోదీకి సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ తల్లి వందేళ్ల పోరాటం భారతీయ ఆదర్శాలకు నిదర్శనంగా నిలుస్తుందని మాతృదేవోభవ స్ఫూర్తికి ప్రధాని కట్టుబడి ఉన్నారని, హీరాబెన్‌ ఆత్మకు శాంతి కలగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే హీరాబా ఆత్మకు శాంతి చేకూరాలని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ట్వీట్‌ చేశారు.

తల్లిని మించిన గురువు, దైవం, స్నేహితురాలు ఉండరని, ప్రపంచంలోని అతి పెద్ద దుఃఖం తల్లిని కోల్పోవడమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదీ తల్లిని కోల్పోవడం అత్యంత బాధాకరమైనదని, ఇలాంటి సంక్లిష్ట సమయాలను ఎదుర్కొనే ధైర్యం ఆ కుటుంబానికి ఉండాలని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా హీరాబెన్‌ మృతి బాధాకరమని ప్రధాని కుటుంబానికి సంతాపం తెలియజేశారు. బీజేపీ నాయకుడు ఆడ్వాణీ  ప్రధానికి తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నిరాడంబరంగా గడిపిన ఆమె జీవితం ఎప్పటికీ మరువలేనిదన్నారు.  

ప్రపంచ నేతల సంతాపం  
ప్రపంచ దేశాల అధినేతలు కూడా ప్రధాని మోదీకి సంతాపం తెలియజేశారు. జపాన్‌ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ, నేపాల్‌ ప్రధాని ప్రచండ, పాకిస్తాన్‌ ప్రధానిమంత్రి షెబాజ్‌ షరీఫ్‌లు ట్విటర్‌ వేదికగా సంతాపాన్ని తెలియజేశారు. తల్లి లేని లోటు పూడ్చలేనిదని ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని తమ తమ సంతాప సందేశాల్లో పేర్కొన్నారు.‘‘తల్లిని కోల్పోవడం కంటే మించిన లోటు ప్రపంచంలో ఏదీ ఉండదు. భారత ప్రధాని మోదీకి సంతాపం తెలియజేస్తున్నాను’’ అని పాక్‌ ప్రధాని షరీఫ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.   
 
తల్లీ.. నిను తలంచి...!
తల్లి గురించి ప్రధాని మోదీ భావోద్వేగంతో కూడిన ట్వీట్‌ చేశారు. ‘‘నా తల్లి వందేళ్ల గొప్ప ప్రయాణాన్ని పూర్తి చేసుకొని భగవంతుడి పాదాల చెంతకు చేరారు. ఆమెలో నాకు ఎప్పుడూ మూడు గొప్ప సుగుణాలు కనిపిస్తాయి. తపస్సులాంటి జీవితం, నిస్వార్థపర సేవా తత్వం, విలువలకు కట్టుబడి జీవితం. ఇలా ఆమెలో త్రిమూర్తులు కనిపిస్తారు. 100వ పుట్టిన రోజు నాడు అమ్మను కలిసినప్పుడు ఆమె నాతో ‘నీ బుద్ధి చెప్పినట్టుగా పని చేయి. పరిశుద్ధంగా జీవితాన్ని గడుపు’ అని చెప్పారు. ఆ మాటలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’’ అన్నారు.

గత జూన్‌లో హీరా బెన్‌ 100వ పుట్టిన రోజు సందర్భంగా కూడా ఆమె గురించి మోదీ తన బ్లాగ్‌లో రాసుకున్నారు. ‘‘సాదాసీదా జీవితం గడిపినా ఆమె ఒక అసాధారణ మూర్తి. మేం ఆరుగురు పిల్లలం. మమ్మల్ని పెంచేందుకు ఎంతో కష్టపడింది. పరిశుభ్రతకు ప్రాణమిచ్చేది. అదే సమయంలో సామాజిక బాధ్యతలనూ నెరవేర్చింది. పంచాయతీ నుంచి లోక్‌సభ దాకా ప్రతి ఎన్నికల్లోనూ విధిగా ఓటేసింది. గుజరాత్‌ సీఎం అయ్యాక తొలిసారిగా తన ఆశీర్వాదం కోసం వెళ్తే అవినీతికి పాల్పడొద్దని ఒకే సలహా ఇచ్చింది’’ అని గుర్తు చేసుకున్నారు. మొత్తం ఆరుగురు సంతానంలో మోదీ మూడోవారు.

అగ్ర రాజ్య వేదికపైనా...
2015లో అమెరికాలో పర్యటించిన మోదీ సిలికాన్‌ వ్యాలీలో ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తన తల్లి గొప్పదనాన్ని, ఆమె అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనైన తీరు ఆహూతులతోనూ కంటతడి పెట్టించింది. మీ జీవితంలో తల్లి పాత్ర ఏమిటన్న ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రశ్నకు బదులిచ్చే క్రమంలో ప్రదాని కన్నీళ్లపర్యంతమయ్యారు. ‘‘మమ్మల్ని పెంచేందుకు అమ్మ ఇరుగుపొరుగు ఇళ్లలో అంట్లు తోమడం, నీళ్లు పట్టడం వంటి ఎన్నో పనులు చేసింది’’ అంటూ ఆమె ఎదుర్కొన్న కష్టాలను, వాటిని అధిగమించడంలో కనబరిచిన మనో నిబ్బరాన్ని గద్గద స్వరంతో వివరించారు. ‘‘అమ్మకిప్పుడు 90 ఏళ్లు దాటినా అన్ని పనులూ తానే చేసుకుంటుంది. అక్షర జ్ఞానం లేకపోయినా టీవీలో వార్తలు చూసి ప్రపంచంలో ఏం జరుగుతున్నదీ తెలుసుకుంటూ ఉంటుంది’’ అని చెప్పారు.

తల్లి చితి వద్ద విషణ్ణ వదనంతో మోదీ

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement