పోలీస్ బ్యాండ్ అంటే కేవలం గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మోగించడం సహజమే. దీంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పోలీస్ బ్యాండ్ మోగుతుంది. అయితే పంజాబ్‌లోని పోలీస్ శాఖ మాత్రం కాస్త ఢిఫరెంట్‌గా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంది. పెళ్లిలలో కూడా పోలీస్ బ్యాండ్ మోగించాలని భావించింది. ఇంకేం అనుకున్నదే తడవుగా దాని అమలుకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా విడుదల చేసింది. సాధారణంగా పెళ్లి బ్యాండ్ తరహాలోనే ఈ పోలీస్ బ్యాండ్ కోసం రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ ఉద్యోగులైతే ఈ పోలీస్ బ్యాండ్ కోసం గంటకు రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. బుకింగ్ చేసుకున్న నిర్ణీత సమయం దాటితే మాత్రం.. గంటకు వారి నుంచి రూ.2500 వసూలు చేయనున్నారు. అలానే సామాన్య ప్రజలు గంటకు రూ.7000 చెల్లించాలి. బుకింగ్ సమయం దాటితే అదనంగా గంటకు రూ. 3500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ బ్యాండ్ బుకింగ్ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా రవాణా ఖర్చుగా కిలోమీటరుకు రూ.80 చెల్లించాలని అధికారులు తెలిపారు.
అయితే, ఈ నిర్ణయం శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి)కి మింగుడు పడలేదు. ఫిరోజ్‌పూర్ పార్లమెంటు సభ్యుడు, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ బాదల్ ట్వీట్ చేస్తూ, “ ఇదే వారి నిజమైన చిత్రం! రాష్ట్రానికి నిధులు సమకూర్చాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఆలోచనలు ఎలాంటివో ఈ ప్రకటన రుజువు చేస్తోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment