మధ్యప్రదేశ్‌లోని రీవాలో ఒక మహిళ అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఉదంతం వెలుగుచూసింది. ఫ్రీజర్‌లో ఉంచిన ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 30 గంటల ముందే ఆమె మరణించిందని పోలీసులు చెబుతున్నారు. తన సోదరిని ఆమె భర్తే హత్య చేశాడని మృతురాలి సోదరుడు ఆరోపిస్తున్నాడు. అయితే తమ కుమారుని రాకకోసం మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచామని మృతురాలి భర్త చెబుతున్నాడు.
ఫ్రీజర్‌లో మృతదేహం..
పోలీసులు తెలిపిన ప్రకారం వివరాల్లోకి వెళితే రీవా పరిధిలోని జివులా గ్రామానికి చెందిన భరత్ మిశ్రా భార్య సుమిత్ర మృతి చెందిందనే వార్త జూలై 2న మృతురాలి సోదరునికి తెలిసింది. దీంతోవారు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతోపాటు భరత్ ఇంటికి చేరుకున్నాడు. భరత్ ఇంటిలో ఫ్రీజర్‌లో ఉన్న అతని భార్య మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తరలించారు.
భర్తే హంతకుడు?
మృతురాలి సోదరుడు అభయ్ రాజ్ తన సోదరిని ఆమె భర్త భరత్ కొట్టి చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరిని అతను చాలాకాలంగా వేధిస్తూ వస్తున్నాడని, ఇప్పుడు హత్య చేసి, మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచాడని ఆరోపించాడు. అయితే మృతురాలి భర్త.. తన భార్య అనారోగ్యంతో జూన్ 30న మృతిచెందిందని, ఈ విషయాన్ని ముంబైలోని తన కుమారుడు హర్షకు తెలియజేసి, ఆమె మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచానని చెబుతున్నాడు.
కుమారునితో మాట్లాడిన తర్వాతనే..
భరత్ పోలీసులతో మాట్లాడుతూ తన కుమారుడు ముంబైలో ఉంటాడని, అతను వచ్చేందుకు కాస్త సమయం పడుతుందని, అందుకే లయన్స్ క్లబ్ నుంచి ఫ్రీజర్ తెప్పించి, దానిలో తన భార్య మృతదేహాన్ని సురక్షితంగా ఉంచానని తెలిపాడు. తన భార్య పైల్స్‌తో బాధపడుతున్నదని, ఈ వ్యాధి తగ్గేందుకు ఆమె మంత్రగాడిని ఆశ్రయించిందని, అనారోగ్యంతోనే ఆమె మృతి చెందిదని వివరించాడు. తమ కుమారుడు ముంబైలో ఉంటాడని, వాడితో మాట్లాడాకనే తన భార్య మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచానని భరత్ తెలిపాడు.
పోస్టుమార్టం రిపోర్టు కోసం..
పోలీసు అధికారి విజయ్ సింగ్ మాట్లాడుతూ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. రిపోర్టు వచ్చిన తరువాతనే మహిళ మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. ఆ వివరాల ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగుతుందన్నారు.
ఇది కూడా చదవండి: ముంబై చూసేందుకు వచ్చి..ఎన్‌ఆర్‌ఐ కుర్రాడి విషాదాంతం
Comments
Please login to add a commentAdd a comment