లక్నో: సంచలనం సృష్టించిన వైరల్ వీడియోపై దిమ్మతిరిగిపోయే ప్రకటన ఇచ్చారు పోలీసులు. నగ్నంగా నడిరోడ్డుపై నిస్సహా స్థితిలో నడుచుకుంటూ వెళ్లిన అమ్మాయి(15) అత్యాచార బాధితురాలు కాదని, అసలు ఆమెపై అత్యాచారం జరగలేదని, వైద్య పరీక్షలోనూ అది నిర్ధారణ అయ్యిందని ప్రకటించారు. అంతేకాదు.. బాధితురాలిగా చెప్పుకుంటున్న అమ్మాయి తల్లిదండ్రుల స్టేట్‌మెంట్ సైతం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మోరాదాబాద్ వైరల్ వీడియోపై యూపీ పోలీసులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగ్నంగా ఓ అమ్మాయి నిస్సహాయ స్థితిలో నడిరోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వీడియో అది. పదిహేను సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొట్టి.. స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ వైరల్ వీడియోలో ఉంది తన కుటుంబానికి చెందిన వ్యక్తే అని, ఆమె బంధువు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రక్తస్రావంతో ఆమె ఇంటికి చేరిందని, ఆమెపై గ్యాంగ్‌రేప్ జరిగిందని అందులో పేర్కొన్నాడు. భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 1వ తేదీన అఘాయిత్యం జరగ్గా.. 7న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని పేర్కొంటూ ఐదుగురిని అరెస్ట్ కూడా చేసి.. జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే.. వైద్య పరీక్షలో బాధితురాలిపై అఘాయిత్యం జరిగినట్లు రుజువు కాలేదు. అయినప్పటికీ కేసులో దర్యాప్తు కొనసాగించారు పోలీసులు. ఈ లోపు..
మెజిస్ట్రేట్ ముందు బాధితురాలి తల్లిదండ్రుల స్టేట్‌మెంట్ అందరికీ షాక్ ఇచ్చింది. తమ కూతురిపై అసలు సామూహిక అత్యాచారం జరగలేదని, చిన్నప్పటి నుంచి మానసిక సంబంధిత సమస్యలతో ఆమె ఇబ్బందిపడుతోందని మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కేసు ఎవరూ ఊహించని మలుపు తిరిగినట్లయ్యింది. అత్యాచారం జరగకుంటే.. ఆమెను ఆకతాయిలు వేధించి దుస్తులు విప్పించి నడిరోడ్డుపై నడిపించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేసులో దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరోవైపు నడిరోడ్డుపై నగ్నంగా ఓ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటే సాయం చేయాల్సిందిపోయి.. వీడియోలు తీసి వైరల్ చేసిన యువకుల తీరుపైనా విమర్శలు వినిపిస్తున్నాయి.
Warning: Disturbing details ahead
Comments
Please login to add a commentAdd a comment