
హవేరి: ఏ పదవీ శాశ్వతం కాదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అన్నారు. హవేరి జిల్లాలోని సొంత నియోజకవర్గమైన షిగగావ్‌లో ఆదివారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. పదవులు, హోదాలతో సహా ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదన్నారు. జీవితమూ అంతేనన్నారు. ‘ఎంత కాలం ఉంటామో.. ఏ హోదాలో ఉంటామో ఎవరికీ తెలియదు. పదవులు, హోదాలు శాశ్వతం కాదు. ఈ వాస్తవం అనుక్షణం నా మదిలో మెదులుతూ ఉంటుంది.
అవతలి వారికి నేను సీఎంను కావొచ్చు. కాని షిగగావ్‌కు వస్తే మీ బసవరాజ బొమ్మైని మాత్రమే. బసవరాజ అనే పేరు శాశ్వతం. పదవులు కాదు’ అని బొమ్మై వ్యాఖ్యానించారు. దాంతో బొమ్మై ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతారనే ఊహాగానాలు కొన్నివర్గాల నుంచి మొదలయ్యాయి. బొమ్మై మోకాలి సమస్యతో బాధపడుతున్నారని, చికిత్స కోసం విదేశాలకు వెళతారని వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఈ నేపథ్యంలో సీఎంను మారుస్తారనే ఊహాగానాలు కొన్నివర్గాల్లో వినపడుతున్నాయి.