లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో విషాదంలో అద్భుతం జరిగింది. లారీ టైర్ల కిందపడి ఎనిమిది నెలల గర్భిణీ మృతి చెందగా ఆమె పొట్టలోని శిశువు మృత్యుంజయురాలిగా ప్రాణాలతో బయటపడింది. ఆ పసికందును హుటాహుటిన ఫిరోజాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ పాపకు కేవలం సాదారణ చికిత్స అవసరమని తెలిపారు.
ఈ విషాద సంఘటన జిల్లాలోని బర్తపారా గ్రామంలో గురువారం జరిగింది. మృతురాలు ఆగ్రాకు చెందిన కామిని(26)గా పోలీసులు గుర్తించారు. తన తల్లిగారింటికి భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొట్టినట్లు చెప్పారు. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపుతప్పి బాధితురాలి భర్త లారీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దాంతో కామిని రోడ్డుపై పడిపోయిందని, లారీ ఆమెపై నుంచి వెళ్లినట్లు చెప్పారు. తల్లి పొట్టలోంచి బయటపడిన చిన్నారి ప్రాణాలతో ఉండటం గమనించి ఆసుపత్రికి తరలించారని, ప్రస్తుతం శిశువు, ఆమె తండ్రి చికిత్స పొందుతున‍్నట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు లారీపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు ఎస్‌హెచ్‌ఓ. త్వరలోనే లారీ డ్రైవర్‌ను పట్టుకుంటామన్నారు. సంఘటన జరిగిన స‍్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. లారీ టైర్ల కింద పడి తల్లి నుజ్జునుజ్జయినా.. పొట్టలోని శిశువు ప్రాణాలతో బయటపడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు స్థానికులు. ఇది ఒక అద‍్భుతంగా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు
Comments
Please login to add a commentAdd a comment