ప్రమాదానికి గురైన కారు (ఇన్‌సెట్‌లో) మృతురాలు
యడ్లపాడు (చిలకలూరిపేట)/గుంటూరు రూరల్: పెళ్లి అయిన నెలకే ఆ ఇంట శుభవార్త.. కడుపు పండిందన్న వార్తతో ఆ రెండు ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఐదో నెలలో మెట్టినింట సంతోషాల మధ్య సీమంతం నిర్వహించారు. వేడుక పూర్తి అయిన తరువాత పుట్టింటికి తిరుగు ప్రయాణమైన ఆ గర్భిణిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు పొట్టనపెట్టుకుంది. ఆమెతోపాటు కారులో ఉన్న ఆమె తల్లి మరో నలుగురు దుర్మరణం పాలయ్యారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాద వివరాలిలా ఉన్నాయి.
చిలకలూరిపేట మండలం యడవల్లికి చెందిన వేజర్ల వెంకట్రావు, రామాంజమ్మ దంపతుల కుమారుడైన నాగరాజుకు, గుంటూరు రూరల్ మండలానికి చెం దిన తంగేళ్ల శ్రీనివాసరావు, అనసూర్య కుమార్తె జయశ్రీ (19)తో ఆగస్టులో వివాహమైంది. జయశ్రీ 5 నెలల గర్భవతి కావడంతో ఆమెకు సీమంతం నిర్వహించడానికి తల్లి అనసూర్య (40), బంధువు సుంకర రమాదేవి (37), ఆమె కుమార్తె రమ్య (18) సోమవారం వెళ్లారు. పండుగ వాతావరణంలో సీమంతం నిర్వహించారు.
వారిని తీసుకువచ్చేందుకు రమాదేవి కుమారుడు శ్రీకాంత్ (21), అతని మిత్రుడు ఫ్రాన్సిస్ సుమారు రాత్రి 11.45కు కారులో వెళ్లారు. జయశ్రీని వెంటబెట్టుకుని గోరంట్లకు వస్తుం డగా తిమ్మాపురం జాతీయ రహదారిపై ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. 12.30కు జరిగిన ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చున్న జయశ్రీ, అనసూర్య అక్కడే మృతి చెందారు. వారి పక్కనే ఉన్న రమాదేవి, రమ్య, డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్, అతని పక్కన కూర్చున్న ఫ్రాన్సిస్‌కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ నలుగురూ మృతి చెందారు. వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ట్రాక్టర్‌పై ఉన్న ఇద్దరు కూడా గాయాలపాలయ్యారు.
జయశ్రీ అత్తిల్లు యడవల్లి, పుట్టిల్లు గోరంట్ల, ఫ్రాన్సిస్ స్వగ్రామమైన మేడికొండూరు మండలంలోని గుండ్లపాలెం గ్రామాల్లో పండుగ రోజున విషాదఛాయలు అలుముకున్నాయి. అతివేగం.. విపరీతమైన మంచు.. ట్రాక్టర్ ట్రాలీకి వెనుక భాగంలో రేడియం స్టిక్కరు లేకపోవడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment