
న్యూఢిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం పట్ల బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత పదవికి గిరిజన మహిళను ఎంపిక చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ద్రౌపది ముర్ము ఎంపిక గురించి ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం తనకు తెలిపారని వెల్లడించారు. ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తామని జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అధికారికంగా బుధవారం ప్రకటించారు.
గర్వకారణం: నవీన్ పట్నాయక్
ద్రౌపది ముర్ము ఎంపికను బిజూ జనతాదళ్(బీజేడీ), జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) పార్టీలు స్వాగతించాయి. ‘ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వంపై నాతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చించినప్పుడు నేను చాలా సంతోషించాను. ఒడిశా ప్రజలకు ఇది నిజంగా గర్వకారణం’ అని బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ట్వీట్ చేశారు.
జేఎంఎం జేజేలు
తమ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల జార్ఖండ్ అధికార పార్టీ జేఎంఎం సంతోషం వ్యక్తం చేసింది. దేశ అత్యున్నత పదవికి గిరిజన మహిళను ఎంపిక చేయడాన్ని స్వాగతిస్తున్నామని జేఎంఎం అధికార ప్రతినిధి మనోజ్ పాండే తెలిపారు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఆయన ఆకాంక్షించారు. (క్లిక్: ద్రౌపది ముర్ముకు జెడ్ ప్లస్ భద్రత.. 24న నామినేషన్)
Comments
Please login to add a commentAdd a comment