సీఎం నవీన్ నివాస్‌లో ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య కొనసాగుతున్న చర్చ
భువనేశ్వర్: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఝాతో కలిసి రాష్ట్రానికి విచ్చేశారు. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నితీష్‌కుమార్ నేరుగా నవీన్ నివాస్‌కు చేరుకున్నారు. ఇరువురి మధ్య దాదాపు గంటకు పైగా సుదీర్ఘ చర్చ సాగింది. భేటీ అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు మీడియాతో మాట్లాడారు.
నితీష్ జీ భువనేశ్వర్ వచ్చినందుకు సంతోషిస్తున్నాను. మేము పాత స్నేహితులం. అనేక విషయాలను చర్చించామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. బీహార్ నుంచి విచ్చేసే యాత్రికులు, పర్యాటకులు బస చేయడానికి పూరీలో ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణపు స్థలాన్ని బీహార్ ప్రభుత్వానికి గెస్ట్ హౌస్ కోసం ఉచితంగా మంజూరు చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నవీన్ పట్నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని నవీన పట్నాయక్ ఉద్ఘాటించారు. అనంతరం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. తన పాత స్నేహితుడిని కలవడానికి వచ్చినట్లు వెల్లడించారు. చాలా రోజుల తర్వాత కలవడం సంతోషంగా ఉందన్నారు.
మహా ప్రతిపక్ష కూటమి లక్ష్యంగా..?
బీజేపీకి వ్యతిరేకంగా మహా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు, ప్రతిపక్ష నేతలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కృషి చేస్తున్నట్లు జాతీయ స్థాయిలో ప్రచారం సాగుతుంది. ఎన్డీయేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే ఆయన లక్ష్యంగా తెలుస్తోంది. అయితే బీజేపీ మరియు కాంగ్రెస్ వర్గాలతో బీజేడీ సమాన దూరాన్ని కొనసాగిస్తోంది. తృతీయ కూటమి ఏర్పాటు నేపథ్యంలో బీజేడీ ఆది నుంచి ఇదే వైఖరి ప్రదర్శించి, 2019 సంవత్సరం నుంచి వరుసగా ఏర్పాటైన అన్ని సమావేశాల్లో దాటవేత వైఖరితో తప్పించుకుని చలామణి అవుతోంది. తృతీయ కూటమి ఆవిర్భావంలో నవీన్ విభిన్నమైన నానుడితో దాటవేస్తున్నారు. లోగడ అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెసు నుంచి సమాన దూరంలో ఉంటున్నందున తృతీయ కూటమిపై ఆసక్తి లేనట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఇటీవల బీజేపీ, బీజేడీ మధ్య వైరిభావాలు దాదాపు తారాస్థాయికి చేరాయి. అయినప్పటికీ ఆయన వైఖరి ఆంతర్యం బయట పడనీయకుండా జాగ్రత్త వహిస్తున్నారు.
స్థలం కేటాయింపునకే చర్చలా..!
తృతీయ కూటమి వారధులుగా చలామణి అవుతున్న నితీష్ కుమార్, మమత బెనర్జీలు ఇటీవల సీఎం నవీన్ పట్నాయక్‌తో కలిసిన సందర్భంగా పూరీ శ్రీజగన్నాథుని క్షేత్రంలో పశ్చిమ బెంగాలు, బీహారు ప్రాంతాల నుంచి విచ్చేసే యాత్రికులు, పర్యాటకులు బస చేసేందుకు ప్రత్యేక భవనాల కోసం స్థలం కేటాయింపు కోసం చర్చలు పరిమితం అయినట్లు ప్రకటించారు. ఈ ఏడాది మార్చి నెలలో మమతా బెనర్జీ, తాజాగా నితీష్ కుమార్ పర్యటన పురస్కరించుకొని ఆయా రాష్ట్రాల భవనాల నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు ప్రకటించడంతో చర్చలు ముగిసినట్లు ప్రకటించడం విశేషం. ఈ వైఖరితో ఇరుగు, పొరుగు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాలు, బీహారు రాష్ట్రాలతో మైత్రి బంధం బలపడుతుందని నవీన్ పట్నాయక్ అంటున్నారు. కానీ రానున్న ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుపైనే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment