బెంగళూరు : కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులతో ప్రకటించిన అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుండగా అదేరోజు నుంచి పబ్‌లు, బార్‌లు, క్లబ్‌లకు అనుమతించాలని కర్ణాటక నిర్ణయించింది. అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలకు అనుగుణంగా పబ్‌లు, బార్లు, క్లబ్బులను తెరిచేందుకు కర్ణాటక ఎక్సైజ్ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బార్లు, క్లబ్బులు, పబ్‌ల్లో మద్యం విక్రయాలను అనుమతిస్తామని, అయితే వాటి సీటింగ్ సామర్థ్యంలో సగం ఖాళీగా ఉంచాలని కర్ణాటక ఎక్సైజ్ మంత్రి హెచ్ నాగేష్ పేర్కొన్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం మాత్రమే వారు అనుమతించాలని, భౌతిక దూరం సహా ఇతర కోవిడ్-19 నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకూ 1435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా. గత ఏడాది ఇదే సమయంలో ప్రభుత్వానికి వచ్చిన రాబడితో పోల్చితే ఇంతమొత్తంలో ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని అంచనా వేశామని మంత్రి తెలిపారు. మద్యం విక్రయాలకు అనుమతించనిపక్షంలో నష్టాలు 3000 కోట్ల రూపాయలు దాటతాయని చెప్పారు. ఇక ఈ ఏడాది జూన్‌లో కర్ణాటక ప్రభుత్వం వైన్ షాపులను తెరిచేందుకు అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment