ఫైల్ ఫోటో
భువనేశ్వర్/పూరీ: విశ్వవ్యాప్తంగా భక్తజనం కలిగిన పూరీ శ్రీ జగన్నాథుని వార్షిక రథయాత్ర షెడ్యూల్ ఖరారు చేసినట్లు శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి (సీఏఓ) డాక్టర్ క్రిషన్ కుమార్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సోమవారం ఆయన 36 నియోగులతో సమావేశం నిర్వహించారు. స్నాన యాత్ర నుంచి నీలాద్రి విజే వరకు యాత్ర కార్యాచరణపై సమావేశంలో తీర్మానించామని యాత్ర కార్యాచరణపై సేవాయత్‌లు పూర్తి అంగీకారంతో ఏకాభ్రిపాయం వ్యక్తం చేశారని సమావేశం వివరాలను శ్రీ మందిరం సేవల విభాగం అడ్మినిస్ట్రేటర్ జితేంద్ర సాహు తెలిపారు.
యాత్ర కార్యకలాపాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు జగన్నాథ సంస్కృత విద్యా పీఠం ప్రాంగణంలో ప్రత్యేక కోవిడ్ టీకా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల 22వ తేదీ వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. కోవిడ్–19 నెగెటివ్ నమోదైన వారిని మాత్రమే సేవలకు అనుమతిస్తారు. స్నానయాత్రకు 48 గంటలు ముందుగా కోవిడ్ పరీక్షల నిర్వహణ పూర్తి చేస్తారని తెలిపారు.
స్నానయాత్ర
ఈ నెల 24వ తేదీ పౌర్ణమి తిథి సందర్భంగా శ్రీ జగన్నాథుని స్నానయాత్ర జరగనుంది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి స్నానోత్సవం సన్నాహాలు ప్రారంభి స్తారు. ఉదయం 4 గంటలకు పొహండి కార్యక్రమం ముగిస్తారు. శ్రీ మందిరం రత్న వేదిక నుంచి మూల విరాట్లు (సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుడు) ఒక్కోటిగా బహిరంగ స్నాన మండపానికి తరలించడమే పొహండి కార్యక్రమం.
108 కలశాలతో మూల విరాట్లకు సుగంధ జలాభిషేకం నిర్వహించి గజానన అలంకరణ చేస్తారు. ఈ అలంకరణ ఉదయం 11 గంటలతో పూర్తి చేయాలని నిర్ణయించారు. తిరుగు పొహండి స్నాన మండపం నుంచి శ్రీ మందిరం లోనికి మూల విరాట్ల తరలింపు కార్యక్రమానికి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమయం నిర్ధారించారు.
గుండిచా యాత్ర
గండిచా యాత్రగా జగన్నాథుని రథయాత్ర ప్రసిద్ధి. ఈ ఏడాది జూలై 12వ తేదీన దీనిని నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటల నుంచి మూల విరాట్లను రథాలపైకి తరలించే కార్యక్రమం ప్రారంభమవుతుంది. రథాలపై పూరీ గజపతి మహా రాజా దివ్య సింగ్ దేవ్ ఆలయ సంప్రదాయ రీతుల్లో ఛెరా పొంహరా (చీపురుతో రథాలు తుడిచే కార్యక్రమం) సేవలో పాల్గొంటారు. ఈ సేవకు మధ్యాహ్నం 2 గంటలకు సమయం కేటాయించారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి రథాలు లాగేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు.
బహుడా యాత్ర
గుండిచా మందిరం నుంచి మూల విరాట్లు శ్రీ మందిరానికి తరలి వచ్చే యాత్ర బహుడా యాత్ర. దీనినే మారురథయాత్రగా పిలుస్తారు. జూలై 20వ తేదీన ఈ యాత్ర జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.30 గంటల వరకు పొహండి సేవలు నిర్వహించి మూలవిరాట్లు రథాలపైకి చేరగానే సాయంత్రం 4 గంటల నుంచి ఈ యాత్ర ప్రారంభిస్తారు.
స్వర్ణాలంకారం
ఏటా రథ యాత్రను పురస్కరించుకుని రథాలపై మూల విరాట్లకు స్వర్ణాలంకారం చేస్తారు. ఈ అలంకారం జూలై 21వ తేదీన నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించి 5.30 గంటల మధ్య స్వర్ణాలంకారం పూర్తి చేయాలని నిర్ణయించారు.
నీలాద్రి విజే
రథాలపై సేవలు, ఉత్సవాలు ముగియడంతో మూల విరాట్లు చివరగా శ్రీ మందిరం రత్నవేదికకు యథావిధిగా చేరుతాయి. రథాలపై నుంచి రత్న వేదికకు మూల విరాట్లు చేరే ఉత్సవం నీలాద్రి విజే. జూలై 23వ తేదీన ఈ ఉత్సవం జరుగుతుంది. రథాలపైకి తరలించే మూలవిరాట్లను తరలించడంతో మొదలై రత్న వేదికపైకి చేర్చడంతో వార్షిక రథయాత్రకు తెర పడుతుంది.
చదవండి: పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి సిక్కు వర్గం నుంచే..
Comments
Please login to add a commentAdd a comment