బెంగళూరు: శాండల్‌వుడ్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న హీరోయిన్ రాగిణి ద్వివేది, సంజన గల్రానీలు శనివారం బెయిల్ మీద బయటకు వస్తామని భావిస్తుండగా.. వారి ఆశ కాస్త నిరాశ అయ్యింది. వీరికి సంబంధించిన బెయిల్ విచారణ ఈ రోజు జరగాల్సి ఉండగా అది కాస్తా సెప్టెంబర్ 21 కి వాయిదా పడింది. సీసీబీ(సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) అధికారులు తమ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని కనుక బెయిల్ పిటిషన్ విచారణని వాయిదా వేయాలని కోరారు. వారి అభ్యర్థన మేరకు బెంగళూరులోని ఎన్‌డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) ప్రత్యేక కోర్టు రాగిణి, సంజనా బెయిల్ పిటిషన్ విచారణను వచ్చే సోమవారానికి(సెప్టెంబర్ 21) వాయిదా వేసింది. రాగిణి, సంజనలు ఇద్దరికి డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయని.. వారు పార్టీలలో మాదకద్రవ్యాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్‌లకు, పెడ్లర్లకు మధ్య జరిగిన మెసేజ్‌లను కూడా రిమాండ్ కాపీలో పొందు పర్చారు అధికారులు. (చదవండి: డ్రగ్స్‌కేసులో మాజీ ఎమ్మెల్యే కుమారుడు?)
డ్రగ్స్ రాకెట్ కేసుకు సంబంధించి సీసీబీ రాగిణి ద్వివేదిని సెప్టెంబర్ 4 న అరెస్ట్ చేయగా.. సెప్టెంబర్ 8 న సంజన గల్రానిని అరెస్టు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ పరపన అగ్రహార జైలులో ప్రత్యేక సెల్‌లో ఉన్నారు. శాండల్‌వుడ్ డ్రగ్ రాకెట్‌కు సంబంధించి ఇప్పటికే 10 మందికి పైగా అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల సెలబ్రిటీ జంట ఐంద్రితా రే, దిగంత్‌లను సీసీబీ విచారణకు పిలిచింది. ఒక రోజు ప్రశ్నించమే కాక వారి గాడ్జెట్లను స్వాధీనం చేసుకుని తరువాత పంపించింది. ఈ రోజు నటులు అకుల్ బాలాజీ, సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కుమారుడు యువరాజ్‌లను సీసీబీ విచారణకు పిలిపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment