సాక్షి, న్యూఢిల్లీ : నాయకత్వ మార్పు కోరుతూ సీనియర్ నేతలు లేఖ రాసిన నేపథ్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ పార్టీలో పెను ప్రకంపనలు రేపింది. సీనియర్ నేతల తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోనియా ఆరోగ్యం బాగాలేని సమయంలో సీనియర్లు లేఖ రాయడం సరికాదన్న రాహుల్ వారి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించడంతో సమావేశం వాడివేడిగా సాగింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో పార్టీ ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో నాయకత్వ మార్పుపై సీనియర్లు లేఖ రాయడం అసంబద్ధమని రాహుల్ అన్నారు.
రాహుల్ వ్యాఖ్యలపై సీనియర్ నేతలు కపిల్ సిబల్, ఆజాద్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీతో సంబంధాలున్నాయని రాహుల్ వ్యాఖ్యానించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం జీవితం అంకితం చేశామని, ఇన్లాళ్ల తమ కృషికి ఇచ్చే గౌరవం ఇదేనా అని కపిల్ సిబల్ ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలతో కపిల్ సిబల్, ఆజాద్ రాజీనామాకు సిద్ధపడ్డారు. పార్టీ ప్రభుత్వాలు బీజేపీ నుంచి ముప్పును ఎదుర్కొన్న సందర్భాల్లో తాము ముందుండి పరిస్థితి చక్కదిద్దామని రాజస్తాన్ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ వారు పేర్కొన్నారు. ఇంత చేసినా తాము బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు.
రాహుల్ వివరణ
సీడబ్ల్యూసీ భేటీలో తన వ్యాఖ్యలపై నొచ్చుకున్న కపిల్ సిబల్‌తో రాహుల్ మాట్లాడారు. సీనియర్లపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ వివరణ ఇచ్చారు. దీంతో రాహుల్‌పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు సిబల్ వెల్లడించారు.
సోనియా రాజీనామా
ఇక అంతకుముందు పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తాను వైదొలగుతున్నట్టు సోనియా గాంధీ సీడబ్ల్యూసీకి స్పష్టం చేశారు. తన స్థానంలో మరో నేతను ఎంపిక చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గాంధీ కుటుంబ విధేయుడిగా పేరొందిన ఏకే ఆంటోని రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సైతం గాంధీ కుటుంబానికి బాసటగా నిలిచారు. సీడబ్ల్యూసీలో మార్పులు కోరుతూ రాసిన ఈ లేఖ తనను బాధించిందన్నారు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం సోనియా గాంధీ తన పదవీ కాలాన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకత్వంలో మార్పు అనివార్యమని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం కావాలని కోరుతూ 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment