అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఐదు శతాబ్ధాల కల నిజమైందని, సుధీర్ఘ పోరాటం, నిరీక్షణకు తెరపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. భక్తుల పట్టుదల, భక్తి కారణంగానే ఈ చారిత్రక ఘట్టం సాకారమయిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఇంటర్వ్యూలోని ఆయన ఏమన్నారంటే..
ప్రశ్న : రామాలయ నిర్మాణం జరగాలన్న మీ కల సాకారమవుతుందని మీరెప్పుడైనా అనుకున్నారా? ఆ సమయంలో మీరు అధికారంలో ఉంటారని?
యోగి ఆదిత్యనాథ్ : మొదటి నుంచి ఆలయ నిర్మాణంపై ఆశాజనకంగానే ఉన్నాను. ఇదంతా భక్తుల నమ్మకం, సుధీర్ఘ పోరాటంతోనే సాధ్యమయ్యింది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఉద్యమంలో నేను పాల్గొన్నాను. కానీ దశాబ్దాల అనంతరం సాకారమైన రాముని ఆలయ నిర్మాణం సమయంలో నేను ప్రభుత్వంలో ఉంటానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఇది నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది.
ప్రశ్న : ఒక హిందూ ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానాలను ముస్లింలకు పంపడం ఇదే మొదటిసారి. దీనిపై మీ అభిప్రాయం?
యోగి : ఇది రాజరాజ్యం. ఇందులో కులం, మతం అన్న తేడా లేదు. గత ఆరు సంవత్సరాలలో ప్రధాని పనితీరులో కూడా ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రం, రాష్ర్టంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతూ ముందుకు వెళ్తుంది. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఉద్రికత్తలను సృష్టించాలని చూస్తే మాత్రం నేను సహించను. దశాబ్దాల అనంతరం ఈ సమస్య పరిష్కారమయ్యింది. ఏదేమైనా శాంతి భద్రతలను కాపాడటంలో అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం.
ప్రశ్న : మసీదు నిర్మాణానికి ముస్లింలు మిమ్మల్ని ఆహ్వానిస్తే, మీరు లేదా బీజేపీలోని ఇతరులు ఆహ్వానాన్ని అంగీకరించి వెళ్తారా?
యోగి : ఇక్కడ ఒక విషయం గమనించాలి. రామ మందిరం నిర్మాణాన్ని ఆలయ ట్రస్ట్ నిర్వహిస్తుంది. శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమాన్ని సైతం ట్రస్ట్ నిర్వహిస్తుంది కానీ ప్రభుత్వం కాదు. రామరాజ్యంలో అందరూ సమానమే అనే భావనతో వారు ఆహ్వానాలను పంపారు. పారదర్శకంగా విరాళాలను సేకరిస్తున్నారు. ఎవరికి ఆహ్వానాలు పంపాలి, ఎవరికి పంపకూడదు అన్నదానిపై రాష్ర్ట ప్రభుత్వం ఏమాత్రం కలగజేసుకోలేదు. ప్రభుత్వం కేవలం భద్రతను మాత్రమే చూసుకుంటుంది. ఈ ప్రాంతాన్ని ఆధునిక, ఔత్సాహిక నగరంగా అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉంది.
ప్రశ్న : బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, ఎంఎం జోషి శంకుస్థాపన కార్యక్రమానికి ఎందుకు హాజరు కావడం లేదు?
యోగి : ప్రస్తుత కోవిడ్ పరిస్థితులు, వయోభారం కారణంగా వారు రాలేకపోతున్నారు. అయితే ప్రత్యక్ష ప్రసారం ద్వారా కార్యక్రమాన్ని తిలకిస్తారు.
ప్రశ్న : ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో భూమి పూజ నిర్వహించడం అవసరమా? పరిస్థితి కాస్తా మెరుగయ్యాక పెట్టుకోవచ్చు కదా?
యోగి : ఇది పండితుల నిర్ణయం. వేద మంత్రాల మధ్య అభిజిత్ లగ్నంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కోవిడ్ నిబంధనలు అన్ని పాటిస్తున్నాం. సామాజిక దూరం పాటిస్తూ అన్ని జాగ్రత్తల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment