
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి అన్ని రంగాలను చుట్టుముట్టేస్తోంది. రాజకీయ, సినీ, ఆర్థిక ..ఇలా అన్ని రంగాల్లోనూ ప్రకంపనలు రేపుతోంది. ఆర్‌బీఐ మాజీ గవర్నర్, భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు ఎం. నరసింహం(94) కరోనాతో కన్నుమూశారు. దీంతో పలువురు ఆర్థిక రంగ నిపుణులు, పరిశ్రమ పెద్దలు నరసింహం మృతిపై సంతాపం ప్రకటించారు.
కోవిడ్ సంబంధిత అనారోగ్యం కారణంగా హైదరాబాద్ ఆసుపత్రిలో మరణించినట్లు ఆర్‌బిఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ కేడర్ నుండి నియమించబడిన తొలి, ఇప్పటివరకు ఉన్న ఏకైక ఆర్‌బీఐ గవర్నర్ నరసింహం. 1977 మే - నవంబర్ మధ్య ఏడు నెలల స్వల్ప కాలపరిమితిలో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అంతకు ముందు ఆయన ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ప్రపంచ బ్యాంకులో భారతదేశానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, తరువాత ఐఎంఎఫ్‌లో కూడా తన ప్రతిభను చాటారు. 1991 లో ఆర్థిక వ్యవస్థ కమిటీ, బ్యాంకింగ్ రంగ సంస్కరణల కమిటీ చైర్‌పర్సన్‌గా కూడా నరసింహం పనిచేశారు.
నరసింహం నేతృత్వంలోని రెండు కమిటీలు (నరంసింహం కమిటీలు 1991, 1997) ఆధునిక బ్యాంకింగ్ పరిశ్రమ, భారతదేశ బ్యాంకింగ్ రంగంపై విమర్శనాత్మక ప్రభావాన్ని చూపాయి. ఈ కమిటీల కొన్ని ముఖ్య సిఫారసులు బ్యాంకింగ్ రంగ స్వయంప్రతిపత్తికి, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల నియంత్రణ, ఆర్థిక వ్యవస్థలో రిజర్వ్ బ్యాంక్ పాత్రను సంస్కరించడం లాంటి కీలక సంస్కరణలకు నాంది పలికాయి. ఈ నేపథ్యంలోనే నరసింహంను భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడిగా భావిస్తారు.