సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధానిలో వాయు కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించడంలో అత్యవసర చర్యలు తీసుకోనందుకు, మున్సిపల్ కార్పొరేషన్లపై నెపం వేసేందుకు యత్నించినందుకు ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కుంటి సాకులు చెబితే ఆదాయం, పాపులారిటీ స్లోగన్ల ఖర్చులపై ఆడిట్‌కు ఆదేశిస్తామని ఢిల్లీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణం రైతులు పంట వ్యర్థాలు దహనం చేయడం వల్ల కాదని నిర్ధారణకు వచ్చింది. ప్రతివాదుల అఫిడవిట్ల పరిశీలన తర్వాత వాయుకాలుష్యానికి నిర్మాణ కార్యకలాపాలు, పరిశ్రమలు, రవాణా, వాహనాల రాకపోకలతోపాటు అక్కడక్కడ పంట వ్యర్థాలు కాల్చడమనే నిర్ధారణకు వచ్చామని పేర్కొంది. ఎయిర్‌క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ నియంత్రణ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కారకాల నియంత్రణకు ఏయే చర్యలు తీసుకోబోతున్నారో కచ్చితంగా సూచించలేదని పేర్కొంది.
రాజధాని ప్రాంతంలో కొంతకాలం వర్క్‌ఫ్రమ్ హోం అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పంజాబ్, యూపీ, హరియాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మంగళవారం సమావేశం కావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఢిల్లీకి చెందిన విద్యార్థి ఆదిత్య దూబే దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌ల ధర్మాసనం సోమవారం అత్యవసర విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. పంట వ్యర్థాలు కాల్చడానికి సంబంధించి పంజాబ్‌లో ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎవరిపైనా కేసులు పెట్టడం లేదని పేర్కొన్నారు. భవన నిర్మాణాలను నిలుపుదల చేయలేదని తెలిపారు.
సొలిసిటర్ జనరల్ అందజేసిన నివేదిక
కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడుతోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పార్కింగ్ రుసుము 4 రెట్లు పెంచాలని, బహిరంగంగా వ్యర్థాలు తగులబెట్టకుండా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రణాళిక రూపొందించి కోర్టుకు అందజేశారు. పంట వ్యర్థాల వల్ల వచ్చే కాలుష్యం ప్రధాన సమస్య కాదని అంగీకరిస్తున్నారా... ఢిల్లీకి రాకపోకలు మొత్తంగా నిషేధిస్తారా అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. పరిశ్రమలు, రవాణా, దుమ్ము కారణంగానే 75 శాతం వాయు కాలుష్యం వస్తోందని అఫిడవిట్‌లో పేర్కొన్నారని ఆ దిశగా నియంత్రణ ఆలోచించాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. బుధవారానికల్లా ఏయే చర్యలు తీసుకున్నారో తెలపాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment