సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ రేప్ కేసులో దళిత యువతి పేరు బహిర్గతం కావడం పట్ల కూడా వివాదం చెలరేగుతోన్న విషయం తెల్సిందే. ఈ విషయంలో పేరు బహిర్గతం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్, దళిత పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళలపై అత్యాచారానికి సంబంధించి భారతీయ శిక్షాస్మృతిలోని 376, 376 ఏ, 376 బీ, 376 సీ, 376 డీ సెక్షన్ల కింద నమోదయ్యే కేసుల్లో బాధితురాళ్ల పేర్లు బహిర్గతం చేయడం ఐపీసీలోని 228 ఏ సెక్షన్ కింద నేరం. ఈ నేరానికి పాల్పడినవారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించవచ్చు. ఈ విషయంలో సుప్రీం కోర్టు కూడా పలు సార్లు మార్గదర్శకాలను విడుదల చేసింది. (ఇందిర గుర్తొస్తోంది : ఐరన్ లేడీ ఈజ్ బ్యాక్)
బాధితుల అనుమతి లేకుండా వారి పేర్లను బహిర్గతం చేయరాదు. బాధితురాలి ముందస్తు అనుమతితో బహిర్గతం చేయవచ్చు. బాధితులు మరణించిన పక్షంలో కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంక్షేమ సంఘం నుంచి లిఖిత పూర్వక అనుమతితోపాటు బాధితుల సమీప బంధువుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నది సుప్రీం కోర్టు మార్గదర్శకాల సారాంశం. ఈ విషయంలో వార్తా పత్రికలు, ఆడియో, విజువల్ మీడియాలు కచ్చితంగా మార్గదర్శకాలను పాలించాలని కూడా సుప్రీం కోర్టు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment