![Sameer Wankhede hit back at Nawab Malik After Sister In Law Charge - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/8/Nawab_Malik_Sameer_Wankhede.jpg.webp?itok=xb7sRI8s)
ముంబై: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సమీర్ భార్య సోదరి గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని ఆరోపిస్తూ తాజాగా మాలిక్ ట్వీట్ చేశారు. దీనికి తనదైన శైలిలో సమీర్ కౌంటర్ ఇచ్చారు.
‘గుడ్ వర్క్ మిత్రమా. కానీ ఒక మహిళ పేరును స్వప్రయోజనాల కోసం వాడుకోవడం ఎంత వరకు సమంజసం? నిజానికి, మేము పత్రికా ప్రకటనను జారీ చేసేటప్పుడు, మహిళల గౌరవాన్ని కాపాడటానికి వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. ఇద్దరు పిల్లలు, కుటుంబం ఉన్న మహిళ పేరును ఇలా బహిరంగపరచడం మీకు తగునా? మీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నామ’ని సమీర్ పేర్కొన్నారు. (చదవండి: మంత్రి నవాబ్ మాలిక్‌కు హైకోర్టు చురకలు)
సమీర్ వదిన హర్షదా దీననాథ్ రెడ్కర్ పేరు మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద 2008లో నమోదైన కేసులో ఉందని నవాబ్ మాలిక్ వెల్లడించారు. ‘సమీర్ దావూద్ వాంఖెడే.. మీ వదిన హర్షదా దీననాథ్ రెడ్కర్ డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నారా? ఆమె కేసు పుణె కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున మీరు సమాధానం చెప్పాల’ని నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు.
2008 జనవరిలో ఈ కేసు నమోదైనప్పుడు తాను సర్వీస్‌లో కూడా లేనని సమీర్ వాంఖడే తెలిపారు. 2017లో క్రాంతి రెడ్కర్‌ను వివాహం చేసుకున్నట్లు చెప్పారు. అయితే తన సోదరి ఈ కేసులో బాధితురాలిగా ఉందని సమీర్ భార్య క్రాంతి రెడ్కర్ అన్నారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమని అన్నారు. నవాబ్ మాలిక్‌ను తన సోదరి చట్టపరంగా ఎదుర్కొంటారని చెప్పారు. అలాగే ఈ కేసుతో తన భర్తకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. (చదవండి: ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేయాలనుకున్నారు)
Comments
Please login to add a commentAdd a comment