ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) మాజీ ముంబై జోనల్ డైరెక్టర్, ఐఆర్‌ఎస్ అధికారి సమీర్ వాంఖడే జన్మతః ఎస్‌సీ వర్గానికి చెందిన మహర్ కులస్తుడని మహారాష్ట్ర సామాజిక న్యాయ విభాగం శుక్రవారం స్పష్టం చేసింది. ముస్లిం అయిన సమీర్ వాంఖడే నకిలీ ధ్రువపత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం పొందారంటూ వచ్చిన ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన కమిటీ ఈ మేరకు క్లీన్‌చిట్ ఇచ్చింది.
సమీర్ వాంఖడే కులంపై మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ తదితరులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అందిన ఫిర్యాదులపై ముంబై జిల్లా కుల ధ్రువీకరణ పరిశీలన కమిటీ విచారణ జరిపింది. సమీర్, ఆయన తండ్రి ధ్యాన్‌దేవ్ వాంఖడేలు హిందూ మతం వీడి ఇస్లాం స్వీకరించినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొంది. 2021 అక్టోబర్‌లో ముంబై క్రూయిజ్ షిప్‌పై వాంఖడే నేతృత్వంలోని ఎన్‌సీబీ బృందం సోదాలు జరపడం, డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ సహా పలువురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిన విషయమే.
Comments
Please login to add a commentAdd a comment