న్యూఢిల్లీ: అర్ధనగ్న శరీరంపై పెయింటింగ్‌లతో వివాదంలో చిక్కుకున్న కేరళ ఆక్టివిస్టు రెహానా ఫాతిమాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయించాల్సిందిగా ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘అసలు మీరెందుకు ఇదంతా చేశారు? మీరు ఆక్టివిస్టే కావొచ్చు. అయినంత మాత్రాన ఇలా ఎందుకు ప్రవర్తించారు? సమాజంపై ఇది చాలా దుష్ప్రభావం చూపుతుంది. మీరు అసభ్యతను వ్యాపింపజేస్తున్నారు. అసలు ఇలాంటి చర్యలు ఎదుగుతున్న పిల్లలపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో తెలుసా’’అని అసహనం వ్యక్తం చేసింది.(అర్థనగ్నంగా పెయింటింగ్, సోషల్ మీడియాలో దుమారం)
ఇక రెహానా ఫాతిమా తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ మాట్లాడుతూ.. తన క్లైంట్‌పై చైల్డ్ పోర్నోగ్రఫీ కింద ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. పురుషులు అర్ధనగ్నంగా కనిపిస్తే లేని అభ్యంతరం మహిళల విషయంలో ఎందుకో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తన క్లైంట్ మహిళ అయినందు వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కాగా అర్ధనగ్న శరీరంపై కన్నబిడ్డలతో వాటర్ పెయింటింగ్ వేయించుకుంటూ రెహానా ఫాతిమా ఇటీవల ‘బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్’ పేరిట సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. మైనర్లతో అసభ్యంగా ప్రవర్తించారన్న కారణంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు కాగా ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు.(సుప్రీంకోర్టులో ఆ బిషప్‌కు షాక్..)
ఈ నేపథ్యంలో కేరళలోని పలు ఆలయాల్లో కొన్ని దేవతా మూర్తులు కూడా అర్ధనగ్నంగా కనిపిస్తాయని.. అయినప్పటికీ ఆలయానికి వెళ్లిన వారిలో లైంగిక ప్రేరేపణ బదులు ఆ విగ్రహాల్లో దైవత్వమే కనిపిస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. తల్లి శరీరంపై బిడ్డల పెయింటింగ్ కూడా ఇలాంటిదేనని అభిప్రాయపడ్డారు. అదే విధంగా తనపై ఐటీ చట్టం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని ప్రశ్నించారు. ఆ నేపథ్యంలో ఆమె పిటిషన్‌ను విచారించిన హైకోర్టు... ముందస్తు బెయిలుకు నిరాకరించడంతో సుప్రీంకోర్టు ఆశ్రయించగా అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది.
Comments
Please login to add a commentAdd a comment