సాక్షి, న్యూఢిల్లీ : తమ ప్రేమకు అడ్డుగా ఉన్నారని ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హత్యచేసిన ఉత్తరప్రదేశ్ మహిళ షబ్నమ్-సలీంలను ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఒకే కేసులో దోషులుగా తేలిన ప్రియుడు సలీం, ప్రియురాలు షబ్నమ్ ప్రస్తుతం వేరువేరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. 2010లో దిగువ విధించిన మరణశిక్షను 2015లో సుప్రీంకోర్టు సమర్థించడం, ఆ తరువాత దోషులు పెట్టుకున్న క్షమాభిక్షను రాష్ట్రపతి తోసిపుచ్చడంతో ఉరిశిక్ష తప్పలేదు. ఈ క్రమంలోనే ఖైదీలను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేయాలని మథురు జైలు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అదే సమయంలో ఆగ్రా సెంట్రల్ జైలు ఉన్న మరో దోషి సలీంను సైతం ఉరితీసేందుకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. అయితే ఈ రెండు ఉరితీతలకు ఓ ప్రత్యేకత ఉంది. దేశానికి స్వాతంత్య్ర వచ్చిన అనంతరం ఉరితీయబడుతున్న తొలి మహిళ షబ్నమ్ కావడంతో పాటు.. 1984న తరువాత ఆగ్రా సెంట్రల్ జైలులో ఉరితీయడం కూడా ఇదే తొలిసారి.
మథుర జైలులో షబ్నమ్‌ను ఉరితీసే సమయానికి ఆగ్రాలో సలీంను సైతం ఉరికంభం ఎక్కించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అనేక కారాగారాలు ఉన్నప్పటికీ కేవలం ఆగ్రా, మథురలోనే ఉరికంభాలు ఉన్నాయి. అప్పటి బ్రిటిష్ ఇండియాలో 1741లో ఆగ్రా సెంట్రల్‌ను జైలు ఏర్పాటు చేయగా.. ఎంతోమందికి అక్కడ ఉరితీశారు. దేశానికి స్వాతంత్య్ర వచ్చినప్పటి నుంచి 35 మందిని ఉరికంభం ఎక్కించారు. ఒక్క 1959లోనే పదిమంది ఖైదీలను ఉరితీయగా.. 1984లో చివరిసారిగా ఆగ్రాజైలు ఉరితీత జరిగింది. ఓ బాలికపై అత్యంత దారుణంగా హత్యాచారం జరిపిన బులంద్‌షహర్‌కు చెందిన జమాన్ ఖాన్‌ను చివరగా ఉరితీశారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఆగ్రాజైల్లో ఒక్క ఖైదీని కూడా ఉరికంభం ఎక్కించలేదు. దాదాపు 40 ఏళ్ల అనంతరం సలీంను బలిపీఠం ఎక్కించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం.
మరోవైపు దేశంలో 150 ఏళ్ల తరువాత ఓ మహిళను ఉరికంభం ఎక్కించేందుకు మథుర జైలు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. తన ప్రియుడు సలీంతో పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించారన్న కారణంతో 2008లో షబ్నమ్ కుటుంబ సభ్యుల్ని అందరినీ దారుణంగా గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. రెండు పీజీ పట్టాలు పొందిన యువతి ఆరో తరగతి చదవిన యువకుడి కోసం ఇంత దారుణానికి ఒడిగట్టడం దేశ వ్యాప్తంగా సంచలన రేపింది. కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన మథుర కోర్టు 2010 జూలై 14న నిందితులు ఇద్దరికీ మరణశిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. దీనిని సవాలు చేస్తూ దోషులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది.
దీంతో సలీం, షబ్నమ్ 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి ఎదురుదెబ్బ ఎదురైంది. అనంతరం చివరి అవకాశంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు క్షమాభిక్షను అభ్యర్థించగా.. ఆయన దానికి నిరాకరించారు. దీంతో తాజాగా మథుర కోర్టు దోషులను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేయాలని జైలు అధికారులను ఆదేశించింది. త్వరలోనే తేదీలను ఖరారు చేస్తామని స్పష్టం చేసింది. కాగా కాగా బ్రిటిష్ ఇండియాలో చివరి సారిగా 1870లో ఓ మహిళకు ఉరిశిక్షను అమలు చేశారు. మళ్లీ దాదాపు 150 ఏళ్ల తరువాత మహిళను ఉరితీయడం గమనార్హం. అయితే ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ షబ్నమ్‌కు క్షమాభిక్ష పెట్టాలని ఆమె తరుఫు న్యాయవాదులు కోరుతున్నారు. మరోవైపు తన తల్లికి విధించిన ఉరిశిక్షను రద్దుచేయాలని షబ్నమ్ కుమారుడు వేడుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment